రెండు రోజుల పర్యటనకు నేపాల్ చేరుకున్న ప్రధాని

ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ గురువారం ఉదయం నేపాల్ పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పాటు నేపాల్‌లో పర్యటించనున్న మోదీ 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొననున్నారు. ప్రధాని హోదాలో మోదీ నేపాల్‌లో పర్యటించడం ఇది నాల్గోసారి. ఈ రోజు ఉదయమే ప్రత్యేక విమానంలో నేపాల్‌ పర్యటనకు బయల్దేరిన ఆయన ఉదయం 8 గంటల ప్రాంతంలో త్రిభువన్ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ ఆయనకు నేపాల్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.

ఏడుదేశాల రీజినల్ గ్రూప్‌గా ఉన్న 'బిమ్‌స్టెక్‌'లో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ సభ్య దేశాలుగా ఉన్నాయి. బిమ్‌స్టెక్ సదస్సు నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కూడా మోదీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఖాట్మాండులో జరుగనున్న 4వ బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి  వివిఐపీలు వస్తున్న నేపథ్యంలో నేపాల్ అంతర్జాతీయ విమానాశ్రయం, త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాలను రెండెన్నర గంటల పాటు మూసివేయనున్నట్టు ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రూమ్ (ఏటీఆర్) పేర్కొంది.

నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయంలో విమానాల సర్వీసులను నిలిపివేశారు. ఇప్పటికే నేపాల్‌లో భారీ భద్రతను కట్టదిట్టం చేశారు.