సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగం వృథా కాదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు పూర్తి మద్దతును ప్రకటించాయి. ఒడిశాలోని భద్రక్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీలోమాట్లాడుతూ దేశం మొత్తం ఆర్మీకి మద్దతుగా ఉంది. శత్రువులకు మన బలగాలు గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందని స్పష్టం సహసారు. జమ్ముకశ్మీర్‌లో ఐదేళ్లుగా భద్రతా బలగాలు విజయవంతంగా ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లను సమర్థవంతగా నిర్వహిస్తుండడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ ఇటువంటి దాడికి మద్దతు తెలిపింది. ఈ ఉగ్రదాడిపై ప్రతిస్పందించి గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత భద్రతా బలగాలకు తాము పూర్తి స్వేచ్ఛనిచ్చామని వెల్లడించారు.
‘ఈ ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ ప్రోత్సహిస్తోంది. భారత్‌ను చూసి పాక్ భయపడుతోంది. అందుకే, భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. మేము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేస్తున్నాను’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
బిజెపి ప్రభుత్వం రావడంతో దేశం అభివృద్ధి బాట పట్టినదని పేర్కొన్నారు. ‘అప్పట్లో దేశంలో ఏకపక్ష రాజకీయాలు ఉండేవి. అటల్ బిహారీ వాజ్‌పేయీ రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో లోక్‌సభలో పూర్తి మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా బిజెపి నిలిచింది. అప్పట్లో కాంగ్రెస్ మాత్రమే ఈ జాబితాలో ఉండేది. గతంలో భారత్.. పేద దేశాల జాబితాలో ఉండేది. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది’ అని తెలిపారు.
కాగా, 20 ఏళ్ళ పాటు సుస్థిర ప్రభుత్వం కొనసాగుతున్నా ఒడిశా అభివృద్ధిలో ఎందుకు వెనుకబడుతున్నదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. అందుకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజలకు సంజాయిషీ చెప్పవలసిందే అని స్పష్టం చేశారు.