పాక్‌పై దాడి చేయమంటున్న బలూచ్‌ పోరాట యోధులు

పుల్వమా దాడికి ప్రతీకారంగా భారత దళాలు తమ మాతృదేశమైన పాక్‌పై దాడి చేయాలని అమెరికాలోని పాక్‌ వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిని ఈ సంస్థ ఖండించింది. ఈ సంస్థ పాక్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్ర స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది. మోదీ సర్కారు పాక్‌ ప్రభుత్వంతో అన్ని రకాలు సంబంధాలను తెంచుకోవాలని కోరింది. 

భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ను బహిష్కరించడంతో పాటు పాక్‌లో ఉన్న భారత్‌ హైకమిషనర్‌ను వెనక్కు పిలిపించాలని కోరింది. పాక్‌పై యుద్ధం ప్రకటించి ముష్కరులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని సూచించింది. మానవాళికి పాక్‌ పెనుముప్పుగా మారిందని విమర్శించింది. బలూచిస్థాన్‌ ప్రజలు సుదీర్ఘకాలంగా స్వాతంత్య్రం  కోసం పోరాటం చేస్తున్నారు. అయితే పాక్‌ ప్రభుత్వం దమననీతిలో వారిని అణచివేస్తోంది. 

పాక్‌ సైనికుల దురాగతాలకు భయపడిన వేలాదిమంది బలూచీ ప్రజలు ఇతర దేశాలకు వలసవెళ్లారు. ప్రవాసంలో ఉంటున్న బలూచీనేత ఖాన్‌ కలాత్‌ నేతృత్వంలో ప్రవాసంలో బలూచీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు భారత్‌ చేయూతనివ్వాలని బీఎన్‌సీ కోరింది. అదే విధంగా బలూచిస్థాన్‌పై పాక్‌ ఆక్రమణకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. 

ఇలా ఉండగా, పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ రాష్ట్రంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిదిమంది పాక్‌సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్‌లో సైనిక కాన్వాయ్‌ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు సైనికవర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడినట్టు తెలుస్తోంది. దాడికి బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌, బలూచ్‌ రిపబ్లికన్‌ గార్డ్స్‌ సంస్థలు కారణమని అక్కడ నిఘావర్గాలు అనుమానిస్తున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.