మీలాగే నాకూ గుండె రగులుతోంది : ప్రధాని

పుల్వామా దాడిపై దేశ ప్రజల్లోని ఆగ్రహజ్వాలలు తనలోనూ పెల్లుబుకుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దాడిపై జనం గుండెల్లో పొంగిపొర్లుతున్న ఆవేశం తనలోనూ ప్రతిఫలిస్తోందని తెలిపారు. ఉత్తర బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటూ  40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల పట్ల దేశ ప్రజలు రగిలిపోతుని స్పష్టం చేశారు. జవాన్ల కుటుంబాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ వీరితో తానూ మమేకం అవుతున్నానని మోడీ చెప్పారు.

బీహార్‌కు చెందిన ఇద్దరు జవాన్లు సంజయ్ కుమార్ సిన్హా, రతన్‌కుమార్‌లు ఇటీవలి ఉగ్రదాడిలో వీర మరణం పొందారు. ప్రధాని మోడీ తమ ప్రసంగాన్ని స్థానిక అంగిక మాండలికంలో ఆరంభించి ఈ జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ ఇద్దరు అమరవీరులకు తాను సెల్యూట్ చేస్తున్నానని పేర్కొంటూ వీరి మననంలో రెండు నిమిషాల మౌనం పాటిస్తున్నట్లు తెలిపారు. తరువాత తమ ప్రసంగంలో పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగారు.

పాట్నా, భగల్పూరులకు చెందిన ఈ ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తాను ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నానని, ఇటువంటి వీర జవాన్ల కోసం పరితపిస్తున్న వేలాది జనం ఆత్మక్షోభ సంగతి తనకు తెలుసునని, జనం స్పందన తన స్పందనగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. జనంలోని ఆవేశం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో తన మనసు రగిలిపోతోందని సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. సభకు హాజరయిన బీహార్ సిఎం నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలు కూడా ఉగ్రవాద దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి తీవ్రస్థాయి ప్రతిస్పందన ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఉద్వేగభరితంగా ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాని ఆ తరువాత దాదాపు అరగంట సేపు సాగిన ప్రసంగంలో వివిధ ప్రాజెక్టుల గురించి వివరించారు. వీటి మొత్తం విలువ రూ 33,000 కోట్ల వరకూ ఉంటుందని చెప్పారు. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఈ పనులు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు.

కేంద్రంలోని ఎన్‌డిఎ ద్విముఖ అభివృద్ధి వ్యూహాలతో సాగుతుందని, ఒకటి మౌలిక సాధనాసంపత్తిని విస్తరించచేయడం, మరోటి సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం అని తెలిపారు. పటిష్టమైన సుస్థిర ప్రభుత్వానికి పట్టం కట్టడం వల్ల ఈ రెండంచెల వ్యూహం అనుకున్న విధంగా విజయవంతం అవుతుందని, సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలేర్పడుతుందని పేర్కొన్నారు. 

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం

సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ఎన్‌డీఏ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల కాలంలో ఝార్ఖండ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఝార్ఖండ్ లో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి పథకాల కొనసాగింపులో భాగంగానే తాను ఇప్పుడు హజారిబాగ్ పర్యటనకు వచ్చానని చెప్పారు. ‘డుంకా, పాలము, హజారిబాగ్‌లలో మూడు వైద్య కళాశాలలను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇలాంటి వైద్య కళాశాలలు మూడే ఉన్నాయి.

 ప్రస్తుతం ప్రారంభించిన మూడు అదనపు కళాశాలలతో విద్యార్థులు భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు సులభంగా వైద్య సౌకర్యాలను పొందగలుగుతారని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ‘గిఫ్ట్ మిల్క్ స్కీమ్’ గురించి ఆయన మాట్లాడుతూ ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో పోషకాహార ప్రమాణాలను మెరుగుపరుస్తుందని తెలిపారు. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం పొందిన రైతులను మోదీ ఈ సందర్భంగా అభినందించారు.

‘రైతులు ఇప్పుడు ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను తెలుసుకోగలుగుతారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకుంటారు. ప్రభుత్వ పథకాలను తెలుసుకుంటారు’ అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై) ద్వారా రాష్ట్రంలో 57వేల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారని ప్రధాని పేర్కొన్నారు.