మురళి రాకతో ప్రతిభాభారతి అలక !

ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించుకొనే ప్రయత్నం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఒకవంక చేస్తుండగా, స్థానికంగా గల పార్టీలోని సీనియర్ నాయకులూ వారి రాకతో తమ ప్రాబల్యం సన్నగిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ళుగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్యెల్యే లకు మంత్రి పదవులకు పాటు, పలు అధికార పదవులు ఇస్తున్నా వారిని స్థానికి పార్టీ నాయకులు మాత్రం గుర్తించని పరిస్థితులు నెలకొన్నాయి. దానితే వచ్చే ఎన్నికలలో పార్టీలో తిరుగుబాట్లు అనీవార్యంగా కనిపిస్తున్నాయి.

తాజాగా కాంగ్రెస్ కే చెందిన మాజీ మంత్రి కోండ్రు మురళిమోహన్ శుక్రవారం పార్టీలో చేరానికి రంగం సిద్దం కాగా, శ్రీకాకుళం జిల్లలో పార్టీ ఆవిర్భావం నుండి ఉంటూ, పలు కీలక పదవులు పొందిన ప్రతిభాభారతి మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కుడా. మురళి వస్తే తన రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టిన్నట్లే కాగలదని ఆమె భావిస్తున్నారు.

గతంలో ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాల్లో వీరిద్దరూ ప్రత్యర్థు లుగా నిలిచారు. ప్రతిభాభారతి రెండుచోట్లా ఆయన చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె రాజాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జిగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు బదులు ఆమె కూతురు గ్రీష్మకుమారి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో మురళీ మోహన్‌ సైకిల్‌ ఎక్కడంతో పచ్చ టిడిపిలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. రాజాం గతంలో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకటరావు సొంత నియోజకవర్గం. 

ప్రతిభా భారతికి గానీ, ఆమె కుటుంబ సభ్యులకు గానీ ఈసారి పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని పలువురు టిడిపి నేతలు ఇప్పటికే ప్రత్యేకంగా చంద్రబాబు వద్దకు వెళ్లి చెప్పారు. పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో తనకెవరూ సహకరించడం లేదంటూ ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యనారాయణ ముందు కళా వెంకటరావుపై ప్రతిభాభారతి ఫిర్యాదు కుడా చేసారు. ఇటువంటి సమయంలో  మురళీమోహన్‌ పార్టీలో చేరడం ఆమెకు పుండుమీద కారం పోసిన్నట్లయింది.

కాగా, సుదీర్ఘ కాలం తర్వాత తన పాత నియోజకవర్గం, కళా వెంకటరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గం లో ప్రతిభాభారతి అడుగుపెట్టారు. వ్రతం పేరుతో ఒక మండల నేత ఇంట్లో అడుగు పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌టిఆర్‌ పార్టీ స్థాపించినప్పట్నుంచీ తాను ఆ పార్టీలో ఉంటూ ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. కొందరు మాత్రం పార్టీలు మారారని, పదవులు పొందినా కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారని అంటూ పరోక్షంగా కళా వెంకటరావుపై విసుర్లు విసిరారు.

ఇట్లా ఉండగా, మూడు రోజుల కిందట జరిగిన టిడిపి పార్టీ విస్తృత సమావేశంలో  మురళీ మోహన్‌, కళా వెంకటరావు పాల్గొనగా,  ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ప్రతిభాభారతి గానీ, ఆమె అనుయాయులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దానితో పార్టీలో వర్గాలు వికృత రూపం దాల్చుతున్నట్లు స్పష్టమైనది. అసలు ఆ సమావేశం గురించి తనకు తెలియదని, ఎవరూ పిలవలేదని ఆమె పేర్కొనడం గమనార్హం.

మురళీమోహన్‌ ను పార్టీలోకి చేర్చుకోవడం పట్ల తన అభ్యంతరాలను ఆమె మంత్రులు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ల వద్ద ప్రస్తావించడంతో పాటు నేరుగా మంత్రి లోకేష్‌ వద్ద కూడా వ్యక్తం చేసారు. అయితే పార్టీలోకి వస్తున్న వారిని ఎవరినీ వద్దనలేమని, మీ పని మీరు చూసుకోవాలని ముగ్గురూ ఆమెకు జలక్ ఇచ్చారు. చంద్రబాబు ఆమోదంతోనే మురళీమోహన్‌ సైకిల్‌ ఎక్కినా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న తనను కనీసం ఎవ్వరు సంప్రదించక పోవడం పట్ల ఆమె గుర్రుగా ఉన్నారు.