పుల్వామా ఘాతుకానికి పాల్పడిన వారు ఎక్కడా దాక్కోలేరు

పుల్వామా దాడి వెనుక ఉన్న వారు ఎక్కడున్నా కఠినంగా శిక్షించి తీరుతామని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ మరోసారి హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 24 గంటల్లో ఉగ్రవాదులను, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని మోదీ తీవ్రంగా హెచ్చరించడం ఇది నాలుగోసారి.

పుల్వామా ఘాతుకానికి పాల్పడిన వారు ఎక్కడా దాక్కోలేరని, ఎంతమందున్నా, ఎక్కడ దాక్కున్నా ఖాతరు చేసేది లేదని, కఠినంగా శిక్షిస్తామని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఓర్పు, నమ్మకంతో ఉండాలని కోరారు. సైనిక అమరవీరుల త్యాగాలను వృథా కానీయమని, ప్రతీకార దాడులు జరిపేందుకు భారత బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని వెల్లడించారు. 

ఏ సమయంలో చర్యలకు దిగాలో నిర్ణయిస్తామని చెప్పారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్న వారిని ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టేది లేదని  శనివారంనాడు మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ పునరుద్ఘాటించారు.

ప్రజల ఆగ్రహాన్ని తాను గ్రహించానని, మరోసారి దేశప్రజలకు హామీ ఇస్తున్నానని, తగిన ఓర్పు, విశ్వాసంతో వారుండాలని ప్రధాని సూచించారు. ఎలా శిక్షిస్తాం, ఎప్పుడు శిక్షిస్తాం, ఎక్కడ శిక్షిస్తాం, ఏ పద్ధతిలో శిక్షిస్తాం అనేది భద్రతా బలగాలు నిర్ణయిస్తాయని ఆయన చెప్పారు. విభజన తర్వాత ఏర్పడిన దేశం ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తూ దివాళా తీసిందని, ఉగ్రవాదానికి మారుపేరుగా మారిందని పాక్ దమననీతిని మోదీ ఎండగట్టారు.

‘ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ.. తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి తగిన బుద్ధి చెబుతాం. భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం. పుల్వామాలో జవాన్ల మృతి కారణంగా అందరూ చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. మీ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను" అని తెలిపారు. 

జవాన్లలోనూ ఆగ్రహం ఉంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలో. వారి ఆగ్రహాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాదని ప్రధాని స్పష్టం చేశారు.