సెప్టెంబర్ 1 పోస్టల్ బ్యాంకుల ప్రారంభం

పోస్ట్ఫాసుల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) లను  సెప్టెంబర్ 1 న దేశ వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. తొలి దశలో 650 బ్రాంచ్‌లు, 3,250 యాక్సెస్‌ పాయింట్ల ద్వారా సేవలందిస్తుంది. 

ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి దేశవ్యాప్తంగా వున్న మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసులు (యాక్సెస్‌ పాయింట్లు) ద్వారా ఈ బ్యాంకు సేవలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టులో 3,500 మంది నిపుణులైన బ్యాకింగ్‌ అధికారులు, ఇతరులకు ఉద్యోగావకాశాలు లభించటంతో పాటు ఆర్థిక అక్షరాస్యతను పెంచే కార్యక్రమాలలో పాల్గొంటున్న వారికి కూడా ప్రోత్సాహం లభిస్తుంది.

పోస్టల్‌ చెల్లింపుల బ్యాంకు పెట్టుబడుల అంచనా వ్యయాన్ని రు.800 కోట్ల నుండి రు.1,435 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ అదనపు పెట్టుబడి వ్యయం రు.635 కోట్లలో రు.400 కోట్లు టెక్నాలజీ వ్యయానికి, మరో రు.235 కోట్లు మానవ వనరుల విభాగానికి వెచ్చిస్తారు. ఐపీపీబీలో నూటికీ నూరుశాతం ఈక్విటీ కేంద్ర ప్రభుత్వానిదే.

ఐపీపీబీలలో ప్రజలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు ప్రారంభించ్చు. జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు ప్రారంభించవచ్చు. అకౌంట్లు ప్రారంభించేందుకు ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది.

పోస్టల్ బ్యాంక్‌ల సేవలను ఇంటివద్దనే ప్రజలు పొందడానికి వీలవుతుంది. అకౌంట్లు ప్రారంభించడం, ఐదువేల రూపాయల వరకు డబ్బు డిపాజిట్ చేయడం, విత్‌డ్రాచేసుకునే తదితర సేవలు ఇంటివద్దనే లభిస్తాయి. ఇందుకోసం పోస్టల్ శాఖకు చెందిన పోస్ట్‌మెన్‌లు, గ్రామ డాక్ సేవక్స్ (జీడీఎస్) ఉద్యోగులు ఇంటికే వస్తారు. వారి వద్ద బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కు సంబంధించి మొబైల్ డివైజెస్ ఉంటాయి. అయితే సేవలకోసం వినియోగదారులనుండి కొంత రుసుము తీసుకుంటారు.

ఐపీపీబీలలో అకౌంట్లు ప్రారంభించేవారికి క్యూఆర్ కార్డులను ఇస్తారు. వీటి ద్వారా వినియోగదారులు విద్యుత్‌బిల్లులు, టెలిఫోన్ బిల్లులు తదితర వివిధ రకాల పేమెంట్లు చేయవచ్చు. ఐపీపీబీ నుండి ఇతర బ్యాంకు అకౌంట్లకు, ఇతర బ్యాంక్ అకౌంట్ల నుండి ఐపీపీబీల అకౌంట్లకు డబ్బు బదిలీ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఐపీపీబీ ద్వారా పింఛన్లు, ఉపాధిహామీ కూలీ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు తదితర పేమెంట్లు కుడా చేస్తారు.