ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి విపక్షాల భరోసా

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటికి తాము పూర్తి మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు భరోసా ఇచ్చాయి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో శనివారం అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు.

పుల్వామా దాడి వివరాలను, కేంద్రం ఇప్పటివరకు చేపట్టిన చర్యలను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతలకు వివరించారు. అనంతరం ఉగ్రదాడిని ఖండిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ భేటీలో ఆమోదించారు. దేశ సమగ్రతను కాపాడేందుకు, ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న మన భద్రతా బలగాలకు మేం అండగా ఉంటామని తీర్మానంలో పేర్కొన్నారు.

'పుల్వామాలో ఈనెల 14న 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రజలందరితో కలిసి బాధిత కుటుంబాకు అండగా నిలుస్తాం. సరిహద్దు కావల నుంచి అందుతున్న ఉగ్రవాద మద్దతుతో సహా ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని సమష్టిగా వ్యతిరేకిస్తున్నాం' అని ఆ తీర్మానం పేర్కొంది.

 గత మూడు దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదం బెడదను ఇండియా ఎదుర్కొంటోందని, సరిహద్దు కావల ఉన్న బలగాలు ఇండియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఇప్పుడు చాలా చురుకుగా వ్యవహరిస్తున్నాయని ఆ తీర్మానం అక్షేపించింది. 

'ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో ఇండియా దృఢ చిత్తంతో వ్యవహరిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా బలగాలకు సమష్టిగా ఈరోజు సంఘీభావం తెలుపుతున్నాం. దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటాం' అని ఆ తీర్మానం స్పష్టం చేసింది.  

సమావేశం అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ మీడియాతో మాట్లాడారు. ‘పుల్వామా ఘటనతో యావత్‌ దేశం ఆగ్రహంగా ఉంది. నాకు తెలిసినంత వరకు 1947 తర్వాత యుద్ధం సమయంలో కాకుండా ఇంత ఎక్కువ మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భద్రతా దళాలకు మేం అండగా ఉంటాం. యావత్ దేశం మీకు అండగా ఉంటుంది' అని స్పష్టం చేసిన్నట్లు తెలిపారు. 

`ప్రభుత్వంతో మాకు ఎన్నో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ దేశ రక్షణ, భద్రత కోసం మేం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతిస్తాం’ అని ఆజాద్‌ తెలిపారు. అంతేగాక ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మోదీ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశమైతే బాగుంటుందని ఆజాద్‌ అన్నారు.

ఉగ్రవాదంపై ‘జీరో టోలరెన్స్’ తీరుని అవలంభించడమే మొదటి నుంచి తమ ప్రభుత్వ విధానంగా ఉందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ

ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ ప్రజలంతా విచారం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాడేందకు భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉందని, భద్రతా బలగాలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

‘మొదటి నుంచి ఉగ్రవాదం విషయంలో ఎటువంటి సహనం లేకుండా బదులివ్వడమే ప్రభుత్వ విధానంగా ఉంటోంది. శాంతిని కోరుకునే జమ్ముకశ్మీర్‌ పౌరులు ప్రభుత్వం వైపే ఉన్నారు' అని వెల్లడించారు. 

అయితే, సరిహద్దుల్లో ఉగ్రవాదులకు సాయపడేవారు కూడా కొందరు ఉన్నారని పేర్కొంటూ  ఇటువంటి వారు కశ్మీర్‌లో శాంతి, సామరస్యాలు ఉండకూడదని భావిస్తున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. వారు ఆ రాష్ట్ర యువతకు శత్రువుల వంటి వారని మండిపడ్డారు.