19న కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ

రెండోసారి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత ఎట్టకేలకు మంత్రి వర్గ విస్తరణకు తెలంగాణ ముఖ్యమంత్రి తన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రెండు నెలలుగా ఆయనతో పాటు మరొకరు మాత్రమే మంత్రిగా ఉంటూ వచ్చారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం కేవలం ఒక్క మంత్రితో నెట్టుకు వచ్చిన ముఖ్యమంత్రి లేరని చెప్పవచ్చు. 

కేబినెట్ విస్త‌ర‌ణ‌పై రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రాజ్‌భవన్‌లో నిర్వహించనున్నారు. మరోవైపు కేబినెట్‌ కూర్పుపై భిన్నమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో 16 మందికి అవకాశముంది. సుమారు 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ ఉండగలదని చెబుతున్నారు

మరోవంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 22న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, మండలి ఉభయ సభలు సమావేశం కానున్నాయి. నేరుగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.