నక్సల్‌ ఉద్యమంతో సంబంధాలుండబట్టే అరెస్ట్ లు

హక్కుల ఉద్యమకారులకు నక్సల్‌ ఉద్యమంతో సంబంధాలుండబట్టే వారిని అరెస్టు చేశామని, ఆధారాలు లేకుంటే ఈ చర్య తీసుకునేవారిమి కాదని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్‌ కేసర్కర్‌ స్పష్టం చేసారు. ఈ విషయమై ప్రభుత్వంపై వస్తున్ ఆరోపణలను కొట్టిపారవేస్తూ ఈ నక్సల్స్‌ కార్యకర్తల ఇళ్లలో సోదాలు నిర్వహించేముందు తగిన ప్రక్రియను అనుసరించామని తెలిపారు. నక్సల్స్‌ భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. మేధావులు దేశానికి వ్యతిరేకంగా తమ బుద్ధిని ఉపయోగిస్తున్నారనడానికి ప్రొఫెసర్‌ సాయిబాబా పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.

కాగా, రాజకీయాల్లోని ఉన్నతస్థాయి వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవాలన్న కుట్ర జరిగిందని, అరెస్టయిన ఐదుగురు పౌరహక్కుల నేతలు ఆ కుట్రలో భాగమని పుణె పోలీసు సంయుక్త కమిషనర్‌ శివాజీరావు బోద్కె, డిప్యూటీ కమిషనర్‌ శిరీష్‌ సర్దేశ్‌ పాండె తెలిపారు.  అందుకు తమవద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేసారు. పైగా,  కశ్మీరీ వేర్పాటువాదులతోనూ వారికి సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

ఉన్నతస్థాయి రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకోవాలన్న ప్రణాళికను అరెస్టయిన నిందితులను పరస్పరం పంచుకున్నారన్నారని పోలీసు అధికారులు చెప్పారు. ఎల్గార్‌ పరిషద్‌కు మావోయిస్టుల నుంచి నిధులు అందాయన్నాని తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థ పన్నిన భారీ కుట్రలో ఈ ఐదుగురు ఉద్దేశపూర్వకంగా భాగస్వాములయ్యారని, ప్రముఖ పాత్ర పోషించారని ఆధారాలు స్పష్టం చేశాయన్నారు.

వారు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధకార్యకలాపాల్లో పాల్గొన్నారని, వారి చర్యల ఫలితంగా పెద్దసంఖ్యలో భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, కొంతమంది పౌరులూ ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. యువత, విద్యార్థులను తీవ్రవాదం వైపు ఆకర్షించేందుకు ఈ పట్టణ నక్సలైట్లకు బాధ్యతలు అప్పచెప్పినట్లు, మావోయిస్టు సంస్థ కేంద్ర కమిటీకి చెందిన వారి నుంచి శిక్షణ పొందినట్లు, ఆయుధాలను కలిగి ఉన్నట్లు కూడా తమకు ఆధారాలు లభించాయని వెల్లడించారు.

భీమా కోరెగావ్‌ ఘటన కేసులో పుణె పోలీసు బృందాలు పలువురు హక్కుల నేతల ఇళ్లలో సోదాలు జరిపి, అరెస్ట్ లు చేయడంపై వస్తున్న విమర్శలను బిజెపి ఎంపి డా. సుబ్రహ్మణ్య స్వామి తిప్పికొట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నేత ప్రకాశ్‌ కారట్‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని హత్య జరిపేందుకు జరిగిన కుట్ర గురించి సమాచారం అందడంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసారు.

ఈ విషయం న్యాయస్థానం వద్దకు ఎట్లాగు వెడుతుందని అంటూ ప్రభుత్వం చేసింది తప్పని భావించే వారు తమ న్యాయవాదులతో కలిసి కోర్టులో తేల్చుకోవచ్చని హితవు చెప్పారు. ప్రజాస్వామ్య విధానాలు ఇలాగే ఉంటాయని అంటూ ప్రజాస్వామ్యం ఎలా పని చేస్తోందనే విషయం కొందరు అర్థం చేసుకోలేరని ఎద్దేవా చేసారు.  

ప్రభుత్వంపై వస్తోన్న విమర్శలపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారామ్‌ అహీర్ స్పందిస్తూ ‘చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కార్యకలాపాలు జరిపినట్లు ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. దీనికి ఎవరూ ఆటంకాలు కలిగించవద్దు’ అని స్పష్టం చేసారు.