పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతాం

కశ్మీర్‌లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.  పాకిస్తాన్‌ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేసారు. పుల్వామాలో ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని తెలిపారు.

దిల్లీలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన మోదీ భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు సాగవని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారని మోదీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారన్నారు.

ఇలాంటి దాడులతో భారతదేశ సమగ్రతను, స్థిరత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. మానవతావాదులంతా ఏకమై ఉగ్రవాదులపై పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనపై రాజకీయాలు అనవసరమని, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి రావాలని కోరారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా పోరాడదామని హితవు చెప్పారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ప్రధాని పేర్కొన్నారు. వారి ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు. దేశ రక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను ప్రతి క్షణం గుర్తించుకుంటామని అన్నారు. వీర సైనికుల త్యాగాలను ఏ మాత్రం వృథాగా పోనివ్వమన్నారు. సైనికుల ధైర్యం, త్యాగాలు వెలకట్టలేనివని అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసాయిచ్చారు.