సోనియా కృపతో ఎంపికైన కుమారస్వామి

కుమారస్వామి ప్రజల ఆశీర్వాదంతో సీఎం కాలేదని, సోనియా కృపతోనే ఆ పదవికి ఎంపికయ్యారని బీజేపీ జాతీయఅధ్యక్షుడు అమిత్‌ షా ఎద్దేవా చేశారు. కర్ణాటక రాయచూరుజిల్లా సింధనూరు నగరంలోని ప్రభుత్వ పీయూ బాలుర కళాశాల మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన రాయచూరు, కొప్పళ, బళ్లారి లోకసభ నియోజకవర్గాల బీజేపీ శక్తికేంద్రాల ప్రముఖుల సమావేశంలో మాట్లాడుతూ కుమార స్వామి రాహుల్‌గాంధీకి సహాయకుడిగా అధికారాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు.

సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేల్లో సమన్వయం కొరవడిందని విమర్శించారు. కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిద్దరామయ్యనే తమకు సీఎం అని చెపుతుండటం హాస్యాస్పదమని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమ చర్యలు చేపట్టడానికి వీలు కావడంలేదని విమర్శించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయరాదన్న కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలన్నీ చేరి మహాఘటబంధన్‌ చేసుకొన్నాయని ధ్వజమెత్తారు.

రోజుకొక వ్యక్తి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకొంటున్నారని చెబుతూ రాహుల్‌ బాబా, దీది, మాయావతి, అఖిలేశ్‌యాదవ్‌, చంద్రబాబునాయుడు, స్టాలిన్‌, దేవేగౌడలు తమను తామే ప్రధానిగా ప్రకటించుకొంటున్నారని ఎద్దేవాచేశారు. మహాఘటబంధన్‌లో గట్టిబంధం లేదని, దీనివల్ల దేశానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. న్నారు. నరేంద్రమోదీని ఎంతమంది ఒక్కటైనా ఓడించడానికి సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రామమందిరం నిర్మాణం చేసి చూపిస్తామని ప్రకటించిన షా రామ మందిరం నిర్మాణానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందా? లేదా? దేశ ప్రజలకు స్పష్టం చేయాలని సవాల్‌చేశారు.

నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 133 పథకాలను అమలుచేసిందని, ప్రముఖంగా ఉజ్వల, జనధన్‌, రైతులకు సహాయధనం, 50కోట్ల మందికి ఆయుష్మాన్‌ పథకం, శౌచాలయ క్రాంతి, అసంఘటిత కార్మికులకు పెన్షన్‌ పథకం, ఇళ్ల నిర్మాణం, చిన్నవ్యాపారస్థులకు జిఎస్టీ నుండి విముక్తి, దళిత, మహిళ, యువ, వెనుకబడినవర్గాల వర్గాల వారి సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకొన్నారని వివరించారు. . బీజేపీ తన సిద్దాంతాలను పాటిస్తున్నదని, ఇక్కడ ఎవరూ నాయకులులేరని, బూత్‌స్థాయి కార్యకర్తలే బీజేపీకి వెన్నెముక అని చెప్పారు. 

కర్ణాటక లోని 28 లోకసభ క్షేత్రాలతో పాటు దేశంలో మరోసారి బిజేపీ విజయభేరి మ్రోగిస్తుందని అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు.