సామాజిక మాధ్యమాల్లో చెడును ప్రచారం వద్దు

సామాజిక మాధ్యమాల్లో చెడును ప్రచారం చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఇది ఎటువంటి సిద్ధాంతాలు, భావజాలాలకు సంబంధించిన అంశం కాదని.. చెడు ప్రచారం వల్ల సమాజంపై దుష్ప్రభావం పడుతుందని హెచ్చరించారు.  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశిలోని బిజెపి కార్యకర్తలతో జరిపిన వీడియో సంభాషణలో ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

దేశం గురించి సానుకూల వార్తలను పంచుకునే వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజాన్ని బలోపేతం చేసే సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో ఒక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదం సైతం జాతీయ అంశంగా మారిపోతున్నదని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. కొంతమంది మర్యాదకు సంబంధించిన హద్దులను మీరుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.

వారు ఏదైనా తప్పుడు సమాచారాన్ని విన్నా లేదా చూసినా దానిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. దాని వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతున్నదో గమనించడం లేదు. ఇది సిద్ధాంతాలకు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదు. 125 కోట్ల మంది భారతీయులకు సంబంధించినది. ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణతో చెడుకు ప్రచారం లభించకుండా చూసుకోవాలి అని మోదీ పిలుపునిచ్చారు.

‘సామాజిక మాధ్యమాల్లో చెడుని ప్రచారం చేయకుండా ప్రజలు జాగ్రత్త పడాలి. వాటి ద్వారా ఎన్నో మంచి విషయాలను ప్రచారం చేయవచ్చు. కొన్నిసార్లు సామాజిక మాధ్యమాల్లో హద్దులు మీరి పోస్టులు చేస్తున్నారు. దీంతో చాలా మంది అసత్యాలను వింటున్నారు, చూస్తున్నారు. అంతేగాక, వాటిని మరికొందరికి చేరేలా ప్రజలు షేర్‌ చేస్తున్నారు. వాటి వల్ల సమాజానికి తాము ఎంత నష్టం కలిగిస్తున్నామనే విషయాన్ని వారు గుర్తించడం లేదు’ అని పేర్కొన్నారు.

సభ్య సమాజంలో ఉపయోగించకూడని పదాలను వాడుతూ కొందరు పోస్టులు చేస్తున్నారని మోదీ విచారం వ్యక్తం చేసారు. ఇవి ఏ రాజకీయ పార్టీకో, కొందరి భావజాలాలకో సంబంధించిన సమస్యలు కావని అంటూ దేశంలోని ప్రజలందరూ అవగాహనతో మెలిగి చెడు విషయాలను ప్రచారం చేయకుండా, మంచిని మాత్రమే అందరితోనూ పంచుకోవాలని పిలుపునిచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో చెడు పదజాలాన్ని ఉపయోగిస్తూ పోస్టులు చేస్తే ప్రత్యర్థి పార్టీలు వాటి ఆధారంగా విమర్శలు చేస్తాయని బిజెపి కార్యకర్తలను హెచ్చరించారు. తమకు నచ్చని వారిపై బిజెపి తీరు ఈ విధంగా ఉంటుందంటూ ఆరోపణలు చేసే అవకాశం ఉందని చెప్పారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.