కేంద్ర నిధులకు చంద్రబాబు ప్రజలకు లెక్కలు చెప్పాలి

కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ప్రజలకు లెక్కలు చెప్పాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి వి రామమాధవ్ డిమాండ్ చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమాలలో పాల్గొంటూ  కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను తానే ప్రవేశపెట్టినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటాన్నారని ధ్వజమెత్తారు. కేంద్ర  ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించకుండా, రాష్ట్ర పథకాలకు ఆయా నిధులను ఖర్చు చేస్తూ తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారని మండిపడ్డారు. 

ఒకవైపు కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులు, పథకాలను వినియోగించుకుంటూనే.. మరోవైపు రాష్ట్రానికి ఏమీ చేయలేదంటూ దూషిస్తుండడాన్ని తెలుగు ప్రజలు గమనిస్తున్నారని, కేంద్రాన్ని విలన్‌గా చూపే ప్రయత్నం బెడిసికొట్టక తప్పదని ఆయన హెచ్చరించారు. 

ఇటీవల ఢిల్లీలో చేపట్టిన దీక్షకు పదికోట్ల రూపాయాల ఖర్చు చేసి, ఆ తరువాత ముఖ్యమంత్రి  అబద్ధాలు చెబుతున్నారన్నారని రామ్‌ మాధవ్‌ దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ దొంగ దీక్షల పేరిట ప్రజల సొమ్ము రూ.500కోట్లు ఖర్చు చేశారని ఆరోపిస్తూ తక్షణమే ఆ మొత్తాన్ని చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా అవినీతి రాజ్యమేలుతోందని చెబుతూ టీడీపీ పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 

ఏపీకి ఇచ్చిన హామీలు 80శాతం అమలు చేశామని చెప్పారు. ఏపీకి సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను మార్చిలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఆంధ్రా ప్రజలకు బీజేపీ వ్యతిరేకంగా ఉందనే అసత్య ప్రచారాన్ని ఎదుర్కోవడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని చెప్పారు.  

పాలనాపరమైన ఇబ్బందులు పరిష్కారమైన వెంటనే విశాఖకు రైల్వే జోన్‌ వచ్చితీరుతుందని  రామమాధవ్ భరోసా వ్యక్తం చేశారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం నుంచి అవసరమైన సమాచారం కేంద్రానికి రావడం లేదని ధ్వజమెత్తారు. .  రాష్ట్రంలోని అన్ని శాసనసభ, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో బిజెపి  అభ్యర్థులు పోటీచేస్తారని ఆయన తెలిపారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు, పార్టీ ఎమ్యెల్సీలు సోము వీర్రాజు, పి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.