దిశ, దశ లేదని, సరైన నాయకుడు లేని ప్రతిపక్షాలు

దేశంలో ప్రతిపక్ష పార్టీలకు దిశ, దశ లేదని, సరైన నాయకుడు లేరని, విధి విధానాలు లేవని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు.  ఏరోడ్ లో చేనేత, మరమగ్గాల కార్మికుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి బలమైన సిద్ధాంతం, సమర్థమైన నాయకత్వం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మంచి మెజార్టీతో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

తమిళనాడు లోని 39 లోక్‌సభ సీట్లలో బలమైన కూటమిని ఏర్పాటు చేసి పోటీచేస్తామని ఆయన వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైనదని, ఈ రెండు పార్టీలు స్కాంలకు ప్రతీక అని ధ్వమజెత్తారు. అధికారం కోసం డీఎంకే అధినేత స్టాలిన్ ఒక వైపు రాహుల్ గాంధీ నాయకత్వాన్నిబలపరుస్తూనే, మరో వైపు రాహుల్‌ను విమర్శించే మమతా బెనర్జీ కూటమిలో చురుకుగా ఉంటున్నారన్నారని తెలిపారు. 

దేశంలో మోదీ పాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని అమిత్ షా మండిపడ్డారు. దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతూ ప్రజలకు అవాస్తవాలను చెబుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ప్రతిపక్ష పార్టీలు నమ్మే స్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ హయాంలో డీఎంకే భాగస్వామి అని, ఈ పార్టీ వల్ల రాష్ట్రానికి రూ.94వేల కోట్ల నిధులు వస్తే, తమ ప్రభుత్వ హయాంలో రూ.5.42 లక్షల కోట్ల నిధులు వచ్చాయని పేర్కొన్నారు. 

గత నాలుగున్నరేళ్లలో బీజేపీ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరిస్తూ జౌళిపరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జౌళి పరిశ్రమలో సాంకేతికాభివృద్ధికి రూ.1240 కోట్ల నిధులను మంజూరు చేశామని తెలిపారు.