కశ్మీర్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఉగ్రదాడి.. 44 మంది మృతి

పుల్వామా జిల్లాలో జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడి కశ్మీర్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఉగ్రదాడి. మృతుల సంఖ్యా 44కు చేరుకొంది.  2001లో ఇలాంటి ఉగ్రదాడే శ్రీనగర్‌లో చోటుచేసుకుంది. అప్పుడు 38 మంది మరణించగా.. 40 మంది గాయపడ్డారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అలాంటి ఆత్మాహుతి దాడి జరుగడంతో కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేగాక కశ్మీర్‌లో గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన ఉగ్రదాడుల్లో గురువారం జరిగిన దాడి చాలా పెద్దది. 

ఇక లోయలో జరిగిన కారు బాంబు ఆత్మాహుతి దాడులను పరిశీలిస్తే ప్రస్తుత దాడి రెండోవది. మే 2000లో 12వ తరగతి విద్యార్థి కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఆత్మాహుతికి పాల్పడటంతో 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 

 పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్టు స్థానికులు చెప్తుండటంతో ఒకరికంటే ఎక్కువమంది ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేలుడు ధాటికి మృతిచెందిన జవాన్ల శరీరభాగాలు, ఆ బస్సు శిథిలాలు చెల్లాచెదురవడంతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు జమ్ము నుంచి బయలుదేరిన కాన్వాయ్ శ్రీనగర్-జమ్ము రహదారిలో గరిపొరా సెక్షన్‌ను దాటుతుండగా సాయంత్రం దాదాపు 3.15 గంటల సమయంలో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.  

 ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (జేఈఎం) ప్రకటించింది. ఈ దాడిలో దాదాపు డజను వాహనాలు ధ్వంసమైనట్టు జేఈఎం ప్రతినిధి ముహమ్మద్ హసన్ ఓ ప్రకటనలో తెలిపాడు. ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ కమాం డో అనే ఆత్మాహుతి బాంబర్ ఈ దాడికి పాల్పడ్డాడంటూ జేఈఎం అతని వీడియోను విడుదల చేసింది. ఆదిల్ దార్ రైఫిళ్లను చేతపట్టుకుని జేఈఎం బ్యానర్ల ముందు నిలబడిన దృశ్యం ఇందులో కనిపిస్తున్నది. పుల్వామా జిల్లా కాకపొరా ప్రాంతానికి చెందిన ఆదిల్ అహ్మద్ దార్ గతేడాది జేఈఎంలో చేరినట్టు పోలీసులు గుర్తించారు.

కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ శుక్రవారం సమావేశం కానున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులతో శాంతికి విఘాతం కలిగించాలనుకుంటున్న వారి కుట్రలను భగ్నం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశా రు. జైషే మహమ్మద్ ఈ దాడికి పాల్పడింది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడేది లేదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిని రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల నేతలు ముక్తకంఠంతో ఖండించారు.  కాశీర్ లో దాడిని నేపాల్ ప్రధాని కేపీ ఓలి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మోదీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు.

  సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిని అమెరికా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అండగా నిలుస్తామని స్పష్టంచేసింది. జమ్ముకశ్మీర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా గర్హిస్తున్నది. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముష్కర మూకలపై పోరాడటంలో, ఉగ్రవాదాన్ని ఓడించడంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుంది అని భారత్‌లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ట్వీట్ చేశారు. 

సైనికులు లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడులు 

-26 ఆగస్టు 2017: పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది మరణించారు.
-29 నవంబర్ 2016: జమ్ములోని నాగ్రోటాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వల్ల ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
-18 సెప్టెంబర్ 2016: బారాముల్లా జిల్లాలో ఉన్న యూరీ ఆర్మీ క్యాంప్‌పై పాకిస్థాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు దాడి చేయడంతో 18 మంది సైనికులు మరణించారు. దీనికి ప్రతీకారంగా సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో లక్షిత దాడులు (సర్జికల్ ైస్ట్రెక్స్) చేపట్టింది.
-25 జూన్ 2016: పాంపోర్‌లోని శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై వెళ్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
-5 డిసెంబర్ 2014: యూరీలోని మొహ్రాలో ఉన్న ఆర్మీ క్యాంప్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేయడంతో పది మంది సైనికులు అమరులయ్యారు. పై అన్ని ఉగ్రదాడుల్లో ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు.