చంద్రబాబుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు

రాజకీయాలను వ్యాపారంగా మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని  బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. రాజకీయ విలువలను పతనం చేసిన టీడీపీ అధినేత, చంద్రబాబును దేశ రాజకీయాల నుంచి బహిష్కరించాలనిపిలుపిచ్చారు.  ఆయనతో అంటకాగిన పార్టీలు కూడా రాజకీయ విలువలను కోల్పోతున్నాయని మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు చేపట్టిన రాజధాని అమరావతి నిర్మాణం బోగస్ అని, రాజధాని నిర్మాణం పేరిట రియల్ ఎస్టేట్ మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు. 2019 తరువాత తన వ్యాపారం మూతపడుతుందన్న భయంతోనే చంద్రబాబునాయుడు నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం సాగిస్తున్నారని దుయ్యబట్టారు.  చంద్రబాబు బంగారు గుడ్లను కూడా మింగేసే రకమని నిప్పులు చెరిగారు.

రాజధాని నిర్మాణం శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పంపి, పవిత్ర జలాలు, మట్టిని సేకరింపజేశారని, ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ పవిత్రమైన నర్మదానదీ జలాలను, మట్టిని తీసుకుని వచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు నరేంద్రమోదీని చిప్ప తెచ్చారని విమర్శిస్తున్న ముఖ్యమంత్రి తన మంత్రులతో గాడిది పాలు తెప్పించారని సోము ఎద్దేవా చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి చంద్రబాబు కక్షతో ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారని ధ్వజమెత్తారు. తన కుట్రలో భాగంగానే ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని, తరువాత ఈకేసులో ఉన్న రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ దిష్టిబొమ్మలు దహనం చేసినా కమ్యూనిస్టులు, ఇతర నేతలపై కేసులు పెట్టలేదని విమర్శించారు.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రధానికి స్వాగతం పలకాల్సిన చంద్రబాబు విలువలకు పాతరవేశారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాల నుంచి తప్పించుకునేందుకే అనేక యూటర్న్‌లు తీసుకున్నారని దుయ్యబట్టారు. రూ. 10కోట్ల ప్రజా సొమ్ముతో డిల్లీలో దీక్ష చేపట్టిన చంద్రబాబు, ఇప్పటి వరకు రూ 500కోట్లను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వృథా చేశారని సోము ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రయోజనాల కోసం పాటుపడతారని, అయితే చంద్రబాబునాయుడు మాత్రం తన కుటుంబం, తన కుమారుడి అభివృద్ధికి కష్టపడుతున్నారని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మతిస్థిమితంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయాలని సోము వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశాన్ని చట్టంలో ఎందుకు చేర్చలేదని సోము నిలదీశారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కమిటీయే ఇకపై ఏ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించరాదని తీర్మానించిందని వెల్లడించారు. స్వాతంత్య్రం తరువాత ఎపికి అత్యధికంగా నిధులు మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్ష్టం చేసారు.

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కన్నా అదనంగా 10శాతం నిధులు కేటాయించాలని నీతి ఆయోగ్ నిర్ణయించిందని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రానికి అదనంగా రూ. 4,500కోట్లు నిధులు లభిస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం రూ. 5.5లక్షల కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. విజయవాడ-విశాఖపట్నం మధ్య 3వ రైల్వే లైను నిర్మాణంతో సహా అనేక ప్రాజెక్టులకు రైల్వేశాఖ రూ 7,

రూ 500కోట్లు మంజూరు చేసిందని సోము వివరించారు. అలాగే గ్రామీణాభివృద్ధి, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ రూ. 3లక్షల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. కేంద్ర పథకాల కారణంగానే టిడిపి ప్రభుత్వానికి 171 అవార్డులు లభించాయన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వం పసుపు-కుంకుమ పథకం కింద రూ. 10వేల ముందస్తు చెక్కుల పంపిణీపై తమ పార్టీ నాయకుడు గరిమెళ్ల చిట్టిబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సోము వీర్రాజు చెప్పారు.

మార్చి 1న విశాఖలో ప్రధాని సభ

ప్రధాని నరేంద్రమోడీ మార్చి 1న విశాఖపట్నంలో జరిగే సభలో పాల్గొంటారని సోము వీర్రాజు చెప్పారు. ఈనెల 19న ఒంగోలు, 21న రాజమహేంద్రవరంలో ఐదేసి చొప్పున పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి సమావేశాల్లో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొంటారని తెలిపారు. మార్చి 21న రాష్టవ్య్రాప్తంగా కోటి మందితో మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ప్రజల ఇళ్లలో కమల జ్యోతి పేరిట దీపాలు వెలిగిస్తామని పేర్కొన్నారు.