రాఫేల్ డీల్ లో 20 శాతం ఆదా !

రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్రంగా స్పందిస్తూ రాఫెల్‌ ఒప్పందం గురించి కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను అబద్ధాలు అని దయ్యబట్టారు. ఈ ఒప్పందంలో అంతకు ముందు కాంగ్రెస్ హయంలో నిర్ణయించిన ధరలో 20 శాతం మేరకు తమ ప్రభుత్వం ఆదా చేసినదని స్పష్టం చేసారు.

2007లో జరిగిన రాఫెల్‌ యుద్ధ విమానాల గురించి రాహుల్‌ తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తూ ఏడుసార్లు రకరకాల ధరలను చెప్పుకొచ్చారని, ఒకొక్క నగరంలో ఒకొక్క ధర చెబుతున్నారని ఎద్దేవా చేసారు. రాఫెల్‌ ఒప్పందం గురించి చర్చ కిండర్‌గార్డెన్‌ డిబేట్‌ మాదిరిగా ఉందని హేళన చేసారు.

దిల్లీ, కర్ణాటకలో నిర్వహించిన సమావేశాల్లో రాహుల్‌ ప్రసంగిస్తూ రాఫెల్‌ యుద్ధ విమానం ధర రూ.700కోట్లు అని అన్నారు. ఆ తర్వాత పార్లమెంటులో మాట్లాడుతున్న సమయంలో రూ.520కోట్లు అన్నారు. అనంతరం రాయ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఒక్కో యుద్ధ విమానం ధర రూ.540 కోట్లు అని చెప్పుకొచ్చారు. పలు సందర్భాల్లో రాహుల్‌ యుద్ధ విమానాల ధర ఒక్కోరకంగా చెబుతున్నారు అని జైట్లీ మండిపడ్డారు.

ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు 2007లో యుపియే హయంలో మొదట్లో ఒప్పందం జరిగిందని అంటూ దీనికి సంబంధించిన నిజాలన్నింటినీ కాంగ్రెస్‌ అబద్ధంగా చిత్రీకరిస్తోందని ద్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రతి సారి ప్రజలను ఫూల్స్‌ను చేయాలని చూస్తోందని అంటూ అది సాధ్యపడదనే విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. అప్పటి నుండి పదేళ్ళలో పెరిగిన ఉత్పత్తి ఖర్చులను కుడా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఖరారు చేసిన ధరను గమనించాలని అంటూ ఆ విధంగా చూస్తే తాము కాంగ్రెస్ నిర్ణయించిన ధర కన్నా 20 శాతం ఆదా చేసిన్నట్లు స్పష్టం అవుతుందని వివరించారు.

‘‘36 యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో ప్రభుత్వం తప్ప ఏ ప్రైవేటు పార్టీ జోక్యం లేదు. అసలు ఆయనకు ఏం తెలుసు? బేసిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ధరకు, లోడెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పోల్చగలరా’? అంటూ జైట్లీ రాహుల్‌ను ప్రశ్నించారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగడుతూ ఆ పార్టీకు జైట్లీ 15 ప్రశ్నలు సంధించారు.

 ఓ జాతీయ పార్టీ అయి ఉండి ప్రభుత్వానికి సంబంధించిన అంశం విషయంలో ఎందుకు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారంటూ జైట్లీ ప్రశ్నించారు. దీనిపై రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ వెంటనే స్పందించాల్సిందిగా ఆయన కోరారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో యూపీఏ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందో కాంగ్రెస్‌ చెప్పాలని అంటూ దానితో దేశ బధ్రతను పణంగా పెట్టరాని దయ్యబట్టారు.