దేశ ప్రయోజనాలకోసం మరోసారి మెజారిటీ అందించండి

దేశ ప్రయోజనాలకోసం మరోసారి తమకు మెజారిటీ ప్రభుత్వాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర  మోదీ దేశ ప్రజలను పార్లమెంట్ వేదికగా  కోరారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా భారత్ విజయాలను గమనిస్తున్నదని, మెజారిటీ ప్రభుత్వం వల్లే అవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు. 

సార్వత్రిక ఎన్నికల ముందు బుధవారం లోక్‌సభలో ప్రధాని 30 నిమిషాలపాటు చివరి ప్రసంగం చేశారు. రఫేల్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు, కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. పార్లమెంట్‌కు తొలిసారి సభ్యుడినైన తనకు అవన్నీ కొత్త అనుభవాలని వ్యాఖ్యానించారు.  రఫేల్‌పై సభలో తాను మాట్లాడితే ప్రకంపనలు వస్తాయంటూ గతంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ అలాంటిదేమీ సంభవించలేదని విమర్శించారు. 

‘భూకంపం వస్తుందనే మాటను మనం విన్నాం. ఐదేళ్ల సభాకాలం ముగియడానికి వచ్చినా, అలాంటిదేమీ జరగలేదు’ అని ఎద్దేవా చేశారు. రఫేల్‌ ఒప్పందాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు సభలో కాగితం విమానాల్ని ఎగరేయడాన్ని ప్రస్తావిస్తూ ‘వారు విమానాల్ని ఎగరేసేందుకు ప్రయత్నించారు, కానీ మన బలమైన ప్రజాస్వామ్యం, లోక్‌సభ గౌరవం వాటిని సాగనివ్వలేదు, ఎలాంటి భూకంపమూ రాలేదు’ అని పేర్కొన్నారు. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి తాను సమాధానమిస్తున్నప్పుడు వికటాట్టహాసాలు విన్నానని చెబుతూ వృత్తిపరమైన నటులు కూడా అలా నటించలేరని ఎద్దేవా చేశారు. స్పీకర్‌ సుమిత్రామహాజన్‌, కాంగ్రెస్‌ నేత మల్లికార్జునఖర్గే లోక్‌సభలో తమవైన పాత్రలు పోషించారని కితాబునిచ్చారు.

గొంతు బాగా లేక ఖర్గే నేడు సభలో మాట్లాడలేకపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే ప్రసంగాన్ని చాలాసార్లు వినలేకపోయా. కానీ ఆయన చెప్పిన విషయాలను తరువాత చదివాను. ఆయన మాటలు ఎంతో ఆలోచింపజేసేవి. ఆయన మాటలు నా ప్రసంగాలకు ఇంధనంగా ఉపయోగపడేవి. ఖర్గేకు రుణపడి ఉన్నాను అని మోదీ అన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీలాగే ఖర్గే కూడా పార్లమెంట్ జరిగినంతసేపూ సభలో కూర్చునేవారని ప్రశంసించారు.  

 ప్రస్తుత లోక్‌సభ నిర్వహించిన 17 సెషన్లలో ఎనిమిది వందశాతంపైగా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా సభ 85 శాతం ఫలవంతంగా సాగిందని తెలిపారు. ఇంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులుగా సేవలు అందించిన వెంకయ్యనాయుడు, అనంతకుమార్‌ల పనితీరును ప్రశంసించారు.  ప్రజా ప్రయోజనాల కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. 

సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను ప్రపంచం గుర్తిస్తుందని చెబుతూ  ష్టమైన ఆధిక్యంలేని ఎన్నికల ఫలితాల వల్ల దేశం ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడిందని గుర్తు చేశారు.  కానీ, ప్రస్తుతం మెజారిటీతో కూడిన ప్రభుత్వం వల్ల భారత్‌ను అందరూ పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరగడానికి తానుగానీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌గానీ కారణం కాదని, మూడు దశాబ్దాల తర్వాత లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వానిదేనని, ఈ ఘనత దేశ ప్రజలకే చెందుతుందని స్పష్టం చేశారు. 

 భారత్‌ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, సుమారు రూ.360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతోందని చెప్పారు.  ప్రపంచం భూతాపం గురించి చర్చిస్తోందని, భారత్‌ అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుకు కృషి చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించేందుకు తోడ్పడిందని తెలిపారు.

ఐక్యరాజ్యసమితిలో భారత్‌ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయి. ఐరాసలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ జయంతులు నిర్వహిస్తున్నారు.  కొందరు భూకంపం తెస్తామన్నారు.. కానీ అదేమీ రాలేదు. భూకంపాలను తట్టుకుని లోక్‌సభ ఔన్నత్యం పెంపొందింది. ఈ సభలో 203 బిల్లులు ఆమోదం పొందాయిని పేర్కొన్నారు. 

అక్రమాలు అరికట్టేందుకు ఆధార్‌ కార్డు ఎంతో ఉపయోగపడుతోంది. డిజిటల్‌ ప్రపంచంలో భారత్‌ స్థానం సుస్థిరం అయింది. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేపడతాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.

 ప్రస్తుత లోక్‌సభలో అవినీతి, నల్లధనం నిరోధకానికి కఠినమైన చట్టాల్ని ఆమోదించడం జరిగిందని,  జీఎస్టీని కూడా ఆమోదించిందని, ఈ ప్రక్రియ సహకార స్ఫూర్తిని వెల్లడించిందాని పేర్కొన్నారు. 

నల్లధనానికి, అవినీతికి వ్యతిరేకంగా చట్టాలు చేసిన సభగా, దేశాన్ని కోట్ల రూపాయల మేర మోసగించి విదేశాలకు పారిపోయిన వారి ఆటకట్టించిన సభగా 16వ లోక్‌సభను గుర్తు పెట్టుకుంటారని ప్రధాని ప్రకటించారు. 

 16వ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 44 మంది మహిళా ఎంపీలు ఉన్నారని పేర్కొన్నారు. భద్రతపై కేబినెట్‌ కమిటీలో కూడా ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారన్నారు. 16వ లోక్‌సభలో 219 బిల్లులు ప్రవేశపెట్టగా, 203 బిల్లులకు ఆమోదం లభించిందని, అందులో నల్లధనాన్ని నిరోధించే బిల్లుకూడా ఒకటని వెల్లడించారు. వాడుకలో లేని 1400 చట్టాల్ని సభ రద్దు చేసిందని గుర్తు చేశారు. విదేశాల్లో నల్లధనం, బినామీ ఆస్తులు, జీఎస్టీ బిల్లుల్ని సభ ఆమోదించిందని తెలిపారు. 

బంగ్లాదేశ్‌తో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. టిడిపి  ఎంపీ శివప్రసాద్‌ వేషధారణ చూసినప్పుడల్లా సభ్యులకు ఒత్తిడి తగ్గిపోయేదని ప్రధాని  పేర్కొన్నారు. 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు  పేర్కొన్నారు