మధ్యతరగతి ప్రజలకు అనువైన గృహలు నిర్మించాలి

మధ్యతరగతి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గృహ నిర్మాణాల్ని చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు.  న్యూఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరిగిన క్రెడాయ్ యూత్‌కాన్ 2019 సదస్సుకి ముఖ్య అతిథిగాహాజరవుతూ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టేవారికి, అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎదురు చూస్తున్నదని తెలిపారు. నిర్మాణ రంగంలో పారదర్శకత తేవడానికి కృషి చేస్తున్నామని, నీతినిజాయితీగా నిర్మాణాలు చేపట్టేవారే ఈ రంగంలో నిలబడుతారని చెప్పారు.

 

ఈ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను చేపట్టేవారికి ఏటా ప్రత్యేక పోటీలను నిర్వహించాలని క్రెడాయ్ సంఘానికి ప్రధాని సూచించారు. కొనుగోలుదారులకు సకాలంలో ఇండ్లను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రెరాలో ప్రతి ఒక్క డెవలపర్ నమోదు చేసుకుంటారని తెలిపారు.

తమ ప్రభుత్వం రాకముందు నిరుపేదల ఇండ్లను నిర్మించడానికి రూ.33 వేల కోట్లను మంజూరు చేస్తే గత నాలుగున్నరేండ్లలో నాలుగు లక్షల కోట్లను కేటాయించామని చెప్పారు. గత పదేండ్లలో ఎనిమిది లక్షల ఇండ్లను కడితే.. తమ హయంలో 15 లక్షల ఇండ్లను పూర్తి చేశామని వెల్లడించారు.

2022 నాటికి నగర నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తామని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రధానమంత్రి పథకం కింద కట్టే గృహాల నిర్మాణంలో భారీ అవినీతి జరిగేదని,  ఇప్పుడలాంటివన్నీ లేకుండా చేశామని చెప్పారు. దేశ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించే రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి తాము ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేక చర్యల్ని తీసుకున్నామని తెలిపారు.

అయినా, అధిక శాతం మంది డెవలపర్ల ఆలోచనలు జీఎస్టీ చుట్టూ కేంద్రీ కృతమయ్యాయంటూ సభలో నవ్వులు పూయించారు. మనదేశంలో నిర్మాణ రంగం ప్రతిష్ఠ పెరిగేలా డెవలపర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సులభతర వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టాం కాబట్టి, విద్యాధికులైన మూడు వేల మంది యువ డెవలపర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోవాలని సూచించారు. 

సుస్థిరమైన అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని, హరితనిర్మాణాల్ని చేపట్టడానికి ముందుకురావాలని కోరారు. ఏబీ వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయం వల్లే మనదేశంలో ప్రైవేటు నిర్మాణ రంగం వృద్ధి చెందిందని గుర్తు చేశారు. అధిక శాతం మందికి ఉపాధినిచ్చే ఈ నిర్మాణ రంగానికి గౌరవ మర్యాదలున్నాయా అని ప్రశ్నించారు.ఒక్కరు తప్పు చేస్తే దాన్ని ప్రభావం వంద మందిపై పడుతుందన్నారు.