విపక్షాలకు షాకిచ్చిన ములాయం


సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలకు భారీ  షాక్ ఇచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ ముగింపు సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం చెప్పారు. మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని అభినందించారు.

ఆయన పాలన బాగుందని.. ఆయనను ఎవరు వెలేత్తి చూపలేరని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభలోనే ఉన్న మోదీ చిన్నగా చిరునవ్వులు చిందించారు. లోక్‌సభలో సోనియా పక్కనుండగా ములాయం ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించడంతో మొత్తం విపక్షమంతా  షాక్ కు గురయింది. 2019 లో మరోసారి మోదీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని ములాయం వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి గురికాగా, అధికార పార్టీ ఎంపీలు సంతోషంలో మునిగిపోయారు.

ములాయం ప్రశంసిస్తుండగా మోదీ తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారం. మోదీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేసారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంత పోయారు. 

ఉత్తర ప్రదేశ్ లో బిజెపిని ఓడించడం కోసం ఎస్పీ, బీఏపీసీ పార్టీలు కూటమిగా ఏర్పడిన నెల రోజులకే ములాయం ఈ విధంగా మాట్లాడటం ఆయా పార్టీల వర్గాలను ఆశ్చర్య పరిచాయి. ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. మోదీకి వ్యతిరేకంగా కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న అఖిలేశ్ మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజ్వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పటి నుంచి అఖిలేశ్, ములాయం మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.