ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరాలి

నా ఇల్లు- నా బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన కమలజ్యోతి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో  గుంటూరులోని స్వగృహంపై కన్నా బీజేపీ పతాకాన్ని ఎగురవేశారు. నా కుటుంబం బీజేపీ కుటుంబం అనే నినాదంతో దేశంలోని ప్రతి కార్యకర్త ఇంటిపై జెండా ఎగురవేయాలన్నదే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కన్నా పేర్కొన్నారు. 

కేంద్రప్రభుత్వ పథకాల నుంచి లబ్ధిపొందిన ప్రతి ఇంటి ముందు కమలజ్యోతి దీపాలు వెలిగిస్తామని, ఈ కార్యక్రమం ఈనెల 26వ తేదీ వరకు దేశం నలుమూలలా కొనసాగుతుందని తెలిపారు. అలాగే నా ఇల్లు నా బీజేపీ కార్యక్రమం మార్చి 3వ తేదీ వరకు జరుగుతుందని, మార్చి 2న భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పతాకం ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు కంకణబద్ధులు కావాలని కన్నా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జమ్ముల శ్యామ్‌కిషోర్, వి. సత్యమూర్తి, ఉపాధ్యక్షులు కె కోటేశ్వరరావు, ఆర్ లక్ష్మీపతి, కార్యదర్శులు అడపా నాగేంద్రం, కోశాధికారి సన్యాసిరాజు, తదితరులు పాల్గొన్నారు.