అవినీతిని తరిమిగొట్టే వరకు విశ్రమించను

వినీతిని తరిమిగొట్టే వరకు విశ్రమించే ప్రసక్తిలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అవినీతిపరుల భరతం పడుతున్నందుకు భయంతోనే విపక్ష పార్టీలు తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తాను అవినీతిపరుల పాలిట నిజంగా చౌకీదార్‌నని ఆయన వెల్లడించారు. అవినీతినిపరుల ఆటలు కొనసాగనివ్వనందున ఇష్టం వచ్చినట్లు విపక్ష పార్టీలు కుమ్మక్కై మాట్లాడుతున్నాయనిదుయ్యబట్టారు . 

హర్యానాలోని కురుక్షేత్రలో   స్వచ్ఛ శక్తి 2019 పేరిట జరిగిన మహిళా సర్పంచుల సదస్సులో పాల్గొంటూ స్వచ్చ భారత్ మిషన్ కార్యక్రమంలో మహిళలు క్రియాశీల పాత్ర వహిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.  దేశంలో రాజ్యాంగం పట్ల విధేయత కలిగిన ప్రతి వ్యక్తి తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను సమర్థిస్తున్నారని తెలిపారు. హర్యానాలో కూడా అవినీతికి పాల్పడిన నేతలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అందుకే ఇక్కడ అవినీతికిపాల్పడిన నేతలపై విచారణకు వచ్చే దర్యాప్తు ఏజన్సీలపై కూడా ప్రతిపక్ష పార్టీలు బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. 

అవినీతిపై పోరాడుతున్న తనను బెదిరిస్తామనుకుంటే వారి ఆటలు సాగనివ్వబోమని ప్రధాని హెచ్చయిరాలు. అవినీతి మురికిని పెకిలిస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఇక్కడ ఆరు జాతీయ ప్రాజెక్టులు నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్, జజ్జర్, శ్రీకృష్ణ ఆయూష్ వర్శిటీ తదితరమైన ప్రాజెక్టులకు ఈ సందర్భంగా ప్రధాని  శంకుస్థాపన చేశారు. 

ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధ అజెండా లేదని ప్రధాని విమర్శించారు. హర్యానాలో జరిగిన అనేక స్కాంలలో చాలా మంది నేతల పేర్లు బయటపడుతున్నాయని ప్రధాని గుర్తు చేశారు.  అభివృద్ధిపై స్పష్టత లేని ప్రతిపక్ష పార్టీలు కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవాకులు చవాకులు వాగుతున్నాయని ప్రధాని మండిపడ్డారు. వీరికి నిబద్ధత లేదని  చెబుతూ ప్రజలందరూ బీజేపీ పాలనను హర్షిస్తుంటే, విపక్షపార్టీలు భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 

పెద్ద ఎత్తున జరిగిన స్వచ్ శక్తి-2019 కార్యక్రమంలో  ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. జజ్జర్ జిల్లాలో జాతీయ కేన్సర్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ. 2035 కోట్లతో నిర్మించారు. జజ్జర్‌లోని ఎఐఐఎంఎస్‌కు అనుబంధంగా ఈ ఆసుపత్రిని నిర్మించినట్లు ఆయన చెప్పారు. దాదాపు 700 బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఫరీదాబాద్‌లో ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభించారు. ఉత్తర భారతంలో తొలిసారిగా ఈఎస్‌ఐసీ వైద్య కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కాలేజీలో 510 బెడ్స్ ఉన్నాయన్నారు. 

పానిపట్ యుద్ధంపై మ్యూజియంకు ఆయన శంకుస్థాపన చేశారు. పానిపట్ యుద్ధంలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తామని తెలిపారు. అలాగే కర్నాల్‌లో పండిత్ దీన్ దయాళ్ హెల్త్ వర్శిటీకి శంకుస్థాపన చేశారు.