రజనీకాంత్ త్వరలో ఓ టీవీ చానల్, పత్రిక

రాజకీయ పార్టీ ఏర్పాటులో సూపర్ స్టార్ రజనీకాంత్ జాప్యం చేస్తున్నా ముందుగా తన భావనలను ప్రచారం చేసుకోవడం కోసం అభిమాన సంఘాలు అన్నింటిని కలిపి ఏర్పాటు చేసిన రజనీ మక్కల్‌ మండ్రంకు కఠిన నీయమ నిబంధనలు ఏర్పాటు చేస్తూ, ప్రచారం కోసం త్వరలో ఓ టివి చానల్, పత్రిక లను ప్రారంభిస్తున్నట్లు సంకేతం ఇచ్చారు. ఒకే కుటుంభంలో ఒకరికి మంచి పదవులు ఉండబోవని, యువజన విభాగంలో 35 ఏళ్ళలోపే వారీ ఉండాలని, పార్టీ పతాకాన్ని పార్టీ కార్యక్రమాల సమయంలో మాత్రమె ఉపయోగించాలని, ఆ తర్వాత తీసి వేయాలని, వాహనాలలో వాడరాదని, వ్యక్తిగత విమర్శలకు దిగరాదని, మహిళలను గౌరవించాలని అంటూ పలు నిబంధనలను రూపొందించారు.

రజనీ మక్కల్‌ మండ్రంకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వాహకుల్ని ఏర్పాటుచేశారు. ఇందులో ఎవరి మీదైనా సరే చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా తక్షణం ఉద్వాసన పలికి మరొకరికి అవకాశం కల్పిస్తున్నారు. రజనీ మక్కల్‌ మండ్రం తమిళనాడుకు రక్షకులుగా నిలబడాలన్న కాంక్షతో నిబంధనల్ని కఠినత్వం చేస్తూ కీలక నిర్ణయాలను తాజాగా తీసుకున్నారు. రజనీ మక్కల్‌ మండ్రం నియమ నిబంధనల్ని ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఇందులో అనేక కీలక, కఠిన అంశాలను పొందుపరిచారు. రక్షకులు ఎలా ఉండాలో చాటడంతో పాటు, అందుకు సిద్ధపడే వాళ్లు ఎలా తమను తాము మలచుకోవాలో వివరిస్తూ అంశాల్ని వివరించారు.

పార్టీ ఆదేశించకుండా ఎలాంటి విరాళాల్ని సేకరించకూడదు. ఇతరుల్ని హేళనచేసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో స్పందించరాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రీతిలో నడుచుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగానే మక్కల్‌ మండ్రం నిర్వాహకుల ఎంపిక ఎన్నికలు జరిగే రీతిలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలి. మార్పులు చేర్పులు, ఉద్వాసనలు, చర్యల విషయాల్లో అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనంటూ అనేక నిబంధనల్ని అందులో పొందుపరిచారు.