అమెరికాలో తప్పిన మరో షట్‌డౌన్ ప్రమాదం?

అమెరికాలో మరో సారి షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ప్రభుత్వానికి అవసరమైన నిధులకు సంబంధించి ప్రధాన పక్షాలయిన డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తాత్కాలికంగా ఒక ఒప్పందం కుదరడంతో మరోసారి ట్రంప్ ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అయితే అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్టంభనకు ప్రధాన కారణమైన మెక్సికో సరిహద్దుల్లో గొడ నిర్మాణానికి ట్రంప్ అడిగినట్లుగా 5.7 బిలియన్ డాలర్ల నిధులను మాత్రం ఇవ్వకుండానే ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. 

శుక్రవారంనుంచి మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు స్తం భించిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్( పార్లమెంటు)లోని సెనేట్, ప్రతినిధుల సభల్లోని ఇరు పక్షాలకు చెందిన సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం సోమవారం రాత్రి ఈ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. అక్రమ వలసలను నిరోధించడానికి అమెరికామెక్సికో సరిహద్దుల్లో శాశ్వత గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్ల నిధులను ట్రంప్ ప్రతిపాదించడంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర విభేదాల కారణంగా గతంలో అమెరికా చరిత్రలోనే ఎన్న డూ లేని విధంగా 35 రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే.

కాగా, హోంలాండ్ సెక్యూరిటీ, మరో ఆరు ఇతర బిల్లులకు సంబంధించి తమ మధ్య సూత్రప్రాయంగా ఒక అంగీకారం కుదిరినట్లు సెనేటర్ రిచర్డ్ షెట్బీ  చెప్పారు. ఫలితంగా ఈ నెల15 గడువుకు ముందే ప్రతినిధుల సభ, సెనేట్‌లు కొత్త తీర్మానాన్ని ఆమోదిస్తాయని తెలుస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం హోంలాండ్ సెక్యూరిటీ బిల్లులో మెక్సికో గోడ నిర్మాణానికి 1.375 బిలియన్ డాలర్ల నిధులను మాత్రమే కేటాయిస్తారని తెలుస్తోంది. అంటే ట్రంప్ డిమాండ్ చేసిన నిధులకన్నా చాలా తక్కువగా కేటాయిస్తారు. 

ఒక వేళ దీన్ని గనుక పార్లమెంటు ఆమోదిస్తే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ప్రతిష్టంభనకు తెరపడుతుంది. గోడ నిర్మాణంపై తన మద్దతుదారుల ర్యాలీనుద్దేశించి ప్రసంగించడం కోసం అధ్యక్షుడు ట్రంప్ టెక్సాస్ రాష్ట్రంలోని సరిహద్దుప్రాంతమైన ఎల్‌పాసోకు వెళ్లిన తరుణంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ ఒప్పందంపై శ్వేతసౌధం (అధ్యక్ష భవనం) ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. కాగా ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ‘ బహుశా ఒక శుభవార్త మనం వినవచ్చు.అయినా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు’ అని అన్నారు