సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే జైట్లీ ప్యాకేజీ

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వమే అడ్డుకుంటుందని బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఒప్పకున్నారని, ఇప్పుడేమో దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరిని పక్కన పెట్టుకొనే అరుణ్‌ జైట్లీ ప్యాకేజీని ప్రకటించారని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం  అన్ని విధాల సాయం అందిస్తుందని స్పష్టం చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం సవరించిన పోలవరం అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరికి ధన్యవాదాలు తెలిపారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నివేదికలు ఇవ్వలేదని ఆరోపించారు. సరైన నివేదికలు ఇచ్చి ఉంటే కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు జరిగేవని ఆమె చెప్పారు. 

రైల్వే జోన్‌కు సంబంధించి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, జోన్‌ ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె ప్రకటించారు. ప్రధానమంత్రి ఇస్తున్న ఇళ్లను, బీమా పథకాలను చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. 

అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికై ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం ప్రోటోకాల్‌ కూడా పాటించలేదని విమర్శించారు. టీడీపీ ఎన్ని అడ్డంకులను సృష్టించిన సభను బీజేపీ కార్యకర్తలు విజయవంతం చేశారని ఆమె చెప్పారు.