తెలంగాణలో మహాకుటమి దిశగా కాంగ్రెస్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు భారీ కసరత్తు చేస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహితం ఎన్నికల తయారిని వేగవంతం చేస్తున్నది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కనీసం 75 సీట్లు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు యన్ ఉత్తమకుమార్ రెడ్డి తరచూ ధీమా వ్యక్తం చేస్తున్నా ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దపడటం లేదు. బహుముఖ పోటీ జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి, టి ఆర్ ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా మారవచ్చని ఆందోళన చెందుతున్నారు. అందుకనే కలసి వచ్చే పార్టీలతో కలసి `మహాకుటమి’ ఏర్పాటు చేయాలనీ భావిస్తునారు.

రెండు రోజులుగా గాంధీ భవన్ లో జరుగుతున్నా విస్తృత సమావేశాలలో పార్టీ ఎన్నికల ఎత్తుగడలపై లోతుగా చర్చిస్తున్నారు. కలసి వచ్చే పార్టీలతో, ప్రజా సంఘాలతో పొత్తులు ఏర్పరచుకోవాలని ఒక నిర్ధారణకు వచ్చారు. పార్టీకి ఇబ్బందిలేని సీట్లను కలిసి వచ్చే పార్టీలకు కేటాయిస్తే బాగుంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా తెలుగు దేశం, కోదండరామ్ ప్రారంభించిన తెలంగాణ జనసమితి, సిపిఐ వంటి పార్టీలతో పొత్తు ఏర్పరచుకోవాలని ఒక అభిప్రాయానికి వచ్చారు. సిపియంతో పొత్తుకు సహితం గతంలో ప్రయత్నం చేసినా ఆ పార్టీ సొంతంగా ఒక కూటమి ఏర్పాటు చేసుకోవడం, కాంగ్రెస్ తో కలసి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేయడంతో ఆ విషయమై ప్రస్తుతానికి సమాలోచనలు జరపడం లేదు.

ముఖ్యంగా టిడిపితో పొట్టు పట్ల చాలామంది నాయకులు సుముఖంగా ఉన్నారు. అయితే ఈ అంశాన్ని పార్టీ అధిష్టానానికి వదిలి వేయాలని భావిస్తున్నారు.  చంద్రబాబు నాయుడితో సోనియా లేకుంటే రాహుల్ గాంధీ మాట్లాడితే పొత్తు కుదరడం ఖాయమని చెబుతున్నారు.  టీడీపీతో పొత్తు కుదిరితే చాలా స్థానాల్లో బలాబలాలు తారుమారు కావడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయ పరిస్థితులు తారుమారు కాగలవని అంచనాకు వచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోనూ పొత్తుల గురించి సంప్రదించాలని పీసీసీ నిర్ణయించింది. కోదండరాం ఎన్ని సీట్లు, ఏ సీట్లు కోరుతారన్న దానిపై పొత్తు ఆధారపడి ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మహాకూటమి తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టాల్సిన బాధ్యత తమపై ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.