దారుణ ఓటమి తప్పదనే చంద్రబాబు చిల్లర డ్రామాలు

వచ్చే ఎన్నికల్లో దారుణ ఓటమి తప్పదన్న భయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ చిల్లర డ్రామాలకు తెరతీశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తీవ్ర స్వరంతో మండిపడదారు. చంద్రబాబు ఢిల్లీలో `ధర్మ పోరాట దీక్ష' జరుపుతున్న సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వ్రాసిన బహిరంగ లేఖలో  రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని, అందువల్లే వివిధ వర్గాలను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు.  తన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి ప్రధాని వచ్చినపుడు కనీసం మర్యాదపూర్వకంగానైనా ఆహ్వానించని చంద్రబాబు హద్దులు దాటి మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌ పక్షాన ఇప్పుడు చంద్రబాబు చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించాహ్రూ. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం కట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబులో కాంగ్రెస్‌ రక్తం ప్రవహిస్తోందని తమకు తెలుసునని, అయితే కాంగ్రెస్‌ను అధిగమించి అబద్ధాలు, అసత్యాలు చెప్పడంతో పాటు మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విద్వేష పూరిత ప్రచారం చేయటాన్ని మాత్రం తాము ఊహించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు తన చెప్పుచేతల్లోని మీడియాతో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్‌కు తొత్తుగా మారారని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసే పలుమార్లు యూటర్న్‌లు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశారని, ఆయన మోసపూరిత రాజకీయాలు క్లైమాక్స్‌కు వచ్చాయని అమిత్‌ షా చెప్పారు. ఊసరవెల్లి సిగ్గుపడేలా చంద్రబాబు రంగు మారుస్తున్నారని విమర్శిస్తూ విభజన చట్టంలోని అనేక వాగ్దానాలను నాలుగేళ్లలో తమ ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. 

ఏపీ ప్రజల అభివృద్ధిపై కాంగ్రెస్‌ పాలకులకు ఎప్పుడూ చిత్తశుద్ధిలేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ట్టంలో పెట్టలేదని, అలాగే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపలేదని చెప్పారు. అలా ఎందుకు చేశారో చంద్రబాబు, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ముంపు మండలాల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తన గొప్పగా చంద్రబాబు చెప్పుకున్నారని విమర్శించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ కింద 1.4.14 నుంచి ఇప్పటి వరకూ రూ. 6,764.70 కోట్లు విడుదల చేశామని వివరించారు.