విభజన చట్టంలో ఉన్న వాటిని ప్రధాని మోదీ అమలు చేయడమే కాకుండా ఏపీ సత్వర అభివృద్ధికి మరింత ముందడుగు వేశారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. విభజన చట్టాన్ని పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టంలోని పలు అంశాలను వేగవంతంగా నాలుగేళ్లలోనే మంజూరు చేయడమే కాకుండా, వాటికి కావాల్సిన నిధులను కూడా ఇచ్చిందని అమిత్ షా చెప్పారు. స్వాతంత్యాన్రంతర భారత్‌లో ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికి ఇంత తక్కువ కాలంలో ఇచ్చిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఇదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని తెలిపారు.
కాకినాడ వద్ద లక్ష కోట్ల రూపాయలతో చేపట్టేపెట్రోకెమికల్ ప్రాజెక్టుకు ఎంవోయూ పూర్తయిందని, వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, కృష్ణపట్నం, చెన్నై, బెంగళూరు గ్రోత్ కారిడార్‌ను మంజూరు చేశామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, రూ. 50 వేల కోట్లతో చేపట్టిన రైల్వే మార్గాల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అమరావతి రైలు మార్గానికి రూ. 2,679.59 కోట్లతో అనుమతి తెలిపామని చెప్పారు.
అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకి రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి ఎన్హెచ్ఏఐ అంగీకరించిందని, రూ. 7,015 కోట్లతో బకింగ్హమ్ కాలువ పునరుద్ధరించడం మరో ప్రధాన ప్రాజెక్టు అని చెప్పారు. రూ. లక్ష కోట్ల విలువైన రోడ్లు, భూ ఉపరితల జలరవాణా మార్గాలకు అనుమతి ఇచ్చామన్నారు. రాజధానిలో మౌలిక వసతులు తదితరాలకు రూ. 2500 కోట్లు ఇచ్చామన్నారు. ఏరాష్ట్రానికి ఇవ్వనన్ని ఎక్కువగా 11.29 లక్షల ఇళ్లను ఏపీకి మంజూరు చేశామని చెప్పారు. అలాగే ఎన్నో పథకాల్లో ఏపీకి ప్రాధాన్యమిచ్చామని వివరించారు.
వెనుకబడ్డ జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేవారికి రాయితీలు ఇస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజనతో ఏపీలో నిరంతర విద్యుత్ సాధ్యమైందని పేర్కొన్నారు. రూ. 24,000 కోట్లతో సౌరవిద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు 2.2 కోట్ల ఎల్ఈడీ బల్బులు సరఫరా చేశామని వెల్లడించారు. ఇక విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు రివైజ్డ్ ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతాన్ని సూచించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకూ ప్రతిపాదనలు పంపలేదని అమిత్ షా విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించకుండా రాజకీయ ఉద్దేశాలతో శంకుస్థాపన చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే కమిటీ పరిశీలన పూర్తయిందని, అంతర్రాష్ట్ర ఇబ్బందులు, నిర్వహణలో ఉన్న చిక్కుల విషయంలో పరిశీలన జరుగుతోందని వెల్లడించారు.