ప్రత్యేక ప్యాకేజీ సంజీవిని కాదని బాబు అన్నారే !

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినపుడు చంద్రబాబు దానిని స్వాగతించారని, అదే సమయంలో ప్రత్యేక హోదా సంజీవిని కాదని, దానితో రాష్ట్రాలేవీ అభివృద్ధి చెందలేదని చెప్పారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే వారిని అరెస్టు చేయించారని , అయితే ఇప్పుడు ఈ విషయంలో ఆయన పూర్తిగా యూటర్న్‌ తీసుకున్నారని విస్మయం వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా కోరిన వారిని ఆయనే అరెస్ట్‌ చేయించాడు. హోదా పొందిన రాష్ట్రాలు ఏమీ బాగుపడలేదని చంద్రబాబు గతంలో అనేకసార్లు చెప్పారు. ఇప్పుడు హోదా కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాటలు మార్చే వ్యక్తులకు చంద్రబాబు పెద్ద ఉదాహరణ అని దుయ్యబట్టారు.  అబద్ధాలు చెప్పే సంస్కృతిని చంద్రబాబు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా నిలిచాయని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నామని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఎస్‌పీవీని ఏర్పాటు చేయడానికి అధికారుల మధ్య అంగీకారం కుదిరిందని, అయితే ఇప్పటి వరకూ దానిపై రాష్టప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.

ఈఏపీ కింద ప్రత్యేక సాయం అందించడానికి కేంద్రం ముందుకొచ్చినా ప్రతిపాదనలు సమర్పించడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం సూచనలను అనుసరించి ఇప్పటి వరకూ రాష్ట్రానికి రూ. 1,37,977.25 కోట్లు విడుదల చేశామని అమిత్ షా తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటి వరకూ రూ. 3 లక్షల కోట్లు కేటాయించామని తెలిపారు. వీటిని చూస్తే ఏపీకి కేంద్రం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో అర్థమవుతుందన్నారు.