పేద విద్యార్థులకు భోజనం వడ్డించిన ప్రధాని

దేశం నుంచి ఆకలిని పారదోలడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్‌  చేస్తోన్న కృషిని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. బృందావన్‌లో పర్యటించిన ఆయన ఎన్జీఓ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు. ‘అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ‘థర్డ్ బిలియన్త్‌ మీల్’ కార్యక్రమంలో పాల్గొనడానికి  బృందావన్‌లో ఉన్నాను. 

ఈ కార్యక్రమంలో భాగమైన వారందరికి అభినందనలు. ఆకలిని పారదోలడానికి వారు చేస్తున్న కృషి అమోఘం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. బృందావన్‌ చంద్రోదయ మందిర్‌ క్యాంపస్‌లో ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మోదీ ఆవిష్కరించారు. 

‘ప్రధాని 20 మంది పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు’ అని ఇస్కాన్‌ స్ట్రాటజిక్ కమ్యునికేషన్‌ హెడ్ నవీన నీరదా దాస వెల్లడించారు. ఇస్కాన్ స్థాపించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. 

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, మానవ వనరులు శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌, బిజెపి  ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు. ‘విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి 10,500  మందికి ఈ భోజనాలు ఏర్పాటు చేశాం’ అని దాస తెలిపారు. ఈ క్యాంపస్‌కు ప్రధాని రావడం ఇదే మొదటిసారన్నారు.