అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు !

చాల రోజులుగా వెలువడుతున్న కథనాలకు బలం చేకూరే విధంగా తమిళ్ నాడులో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు దాదాపు  ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారినట్లు కనబడుతున్నాయి. ఇన్నాళ్లూ దేశ రాజధానిలో, రాష్ట్ర పర్యటన సందర్భంగా బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ వచ్చిన అన్నాడీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి పొన్‌. రాధాకృష్ణన్‌లు కోయంబత్తూరులో  దాదాపు 3 గంటలకు భేటీ కావడం ఆసక్తి కలిగిస్తున్నది.

చర్చల్లోని సారాంశం బయటకు వెల్లడి చేయక పోయినా ఈ సమావేశం పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల కోసమేనని తెలుస్తున్నది. మోదీ సూచనల మేరకే ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటుపై కూడా ఒక అవగాహనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు... అన్నాడీఎంకేతో చేయి కలిపి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, సమత్తువ మక్కక్‌ కట్చి, ఇండియ జననాయగ కట్చి, న్యూ జస్టిస్‌ పార్టీ, పుదియ తమిళగం, తమిళ మానిల కాంగ్రెస్‌, పీఎంకే, డీఎండీకే పార్టీలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని 39 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు పట్టున్న నియోజక వర్గాలు తమకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఈ మేరకు అన్నాడీఎంకే 20, బీజేపీ 7 సీట్లు పంచుకునే అవకాశాలున్నాయి. అన్నాడీఎంకే ఉత్తర చెన్నై, మధ్య చెన్నై, తిరువళ్లూర్‌, కాంచీపురం, తిరు వణ్ణా మలై, కృష్ణగిరి, సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, తిరు ప్పూర్‌, పొల్లాచ్చి, కరూర్‌, రామనాధపురం, విరుదు నగర్‌, తంజావూరు, తేని, నాగ పట్టణం, మదురై, కడలూర్‌, విల్లుపురం స్థానాలను అట్టి పెట్టు కోవాలని భావిస్తోంది.

 ఇక కూటమిలోని సమత్తువ మక్కల్‌ కట్చి తూత్తుకుడిలో రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు అంగీకరించినట్టు సమాచారం. కన్నియకుమారి, దక్షిణ చెన్నై, కోయంబత్తూర్‌, శివగంగ, తిరునల్వేలి, నీలగిరి, తిరుచ్చి నియోజక వర్గాలను బీజేపీ కోరుకుంటోంది.

కూటమిలోని ఇండియ జననాయగ కట్చి పెరంబలూర్‌ లోను, న్యూ జస్టిస్‌ పార్టీ వేలూరులోను, పుదియ తమిళగం తెన్‌కాశిలో కమలం గుర్తుపై పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాగా, పొత్తులపై ఎటూ తేల్చని పీఎంకే కూడా ధర్మపురి, అరక్కోణం, శ్రీపెరుం బుదూర్‌, మైలా డుదురై, చిదంబరం నియోజకవర్గాలు తమకే దక్కాలని భావిస్తోంది. 

మరో వైపు డీఎండీకే కళ్లకు రిచ్చి, ఆరణి నియోజకవర్గాల్లో, జీకే వాసన్‌ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ దిండుగల్‌లో పోటీ చేసేందుకు అంగీకరించినట్టు తెలిసింది.