అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు

నటుడు, మాజీ మంత్రి హరికృష్ణ భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాలు జారీ చేశారు. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో గురువారం జరగనున్న అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఈ విషయమై కుటుంబసభ్యులతో మాట్లాడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.

మెహిదీపట్నంలోని నివాసానికి హరికృష్ణ భౌతికకాయాన్ని తరలించారు. భౌతికకాయం వెంట చంద్రబాబునాయుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, బాలకృష్ణ, నారా లోకేష్ తదితరులు ఉన్నారు.  హరికృష్ణ భార్య షాలినీ, కోడలు ప్రణతి ఇప్పటికీ నివాసానికి చేరుకున్నారు.

మరణానికి ముందు తన అభిమానులకు వ్రాసిన చివరి లేఖలో సెప్టెంబర్‌ 2న తన 62వ పుట్టిన రోజునాడు ఎటువంటి వేడుకలు జరుపవద్దని కోరారు.  మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళలో వరదలు, వర్షాల కారణంగా ఎంతోమంది మరణించారని, వేల మంది  నిరాశ్రయులైనారని అంటూ తన జన్మదిన వేడుకల కోసం చేసే ఖర్చుని బాధితుల కుటంబాలకు అందజేయమని కోరారు. నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు శక్తి మేరకు అందజేయమని తన తన అభిమానులకు చివరిలేఖ రాశారు.

అన్న హరికృష్ణ మృతదేహాన్ని చూసి తమ్ముడు బాలకృష్ణ కంటతడిపెట్టారు. ఆస్పత్రిలోని ఓ గదిలో హరికృష్ణ పార్ధివదేహం ఉండగా అక్కడకు వెళ్లిన బాలకృష్ణ... అన్న మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. అలాగే కంటతడి పెట్టారు.