2030 కల్లా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!

భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థని, 2030 నాటికి ప్రపంచంలో రెండో స్థానంలో ఉండనుందని  ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదురవుతున్నా, వాటిని తట్టుకొని భారత్ ముందుకెళ్తోందని వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయని తెలిపారు.

పెట్రోటెక్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోలియం అండ్ సహజవాయు  మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 13వ అంతర్జాతీయ సదస్సు మొదలైంది. ఈ సదస్సు ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు  జరగనుంది.

స్టాండర్డ్ చార్టెర్డ్ నివేదిక ప్రకారం..యూఎస్‌ను వెనక్కి నెట్టి 2030 కల్లా భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని, చైనా ఆర్థిక వ్యవస్థ మొదటి స్థానాన్ని ఆక్రమించనుందని వివరించింది. యూఎస్‌ మూడో స్థానానికి పరిమితం కానుందని పేర్కొంది. 

‘ప్రస్తుతం భారత్ ఆరోస్థానంలో ఉంది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం 2030 నాటికి రెండో స్థానాన్ని ఆక్రమించనుంది’ అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాల్లో సమతుల్యతను పాటించాలంటే ఇద్దరికి అనుకూలంగా ఉండేలా ధరలను నిర్ణయించాలని, చమురు, గ్యాస్‌ మార్కెట్లలో పారదర్శకత తీసుకురావాలన్నారు. ముడిచమురు, పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులను దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేశారు.

‘రిఫైనింగ్‌ సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2030 కల్లా అది 200 మిలియన్ మెట్రిక్‌ టన్నులకు పెరగనుంది.  గత సంవత్సరం జాతీయ బయో ఇంధన చట్టాన్ని తీసుకువచ్చాం. రెండో తరం బయో ఇంధన రిఫైనరీలను 11 రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఎనర్జీ యాక్సెస్‌, ఎఫీషియన్సీ, సస్టైనబిలిటీ, సెక్యూరిటీ భారత్‌కు నాలుగు స్తంభాలుగా ఉంటాయని 2016లో జరిగిన పెట్రోటెక్‌ కార్యక్రమంలో వెల్లడించాను’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.