చైనా ముంగిట అమెరికా యుద్ధ నౌకలు

సముద్ర మార్గాల విషయంలో చైనా అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణిని సవాలు చేసేందుకు అమెరికా సోమవారం రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను (క్షిపణి విధ్వంసక నౌకలను) దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద స్ప్రాట్లీ దీవుల వద్దకు తరలించింది. ఫ్రీడం ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్‌లో భాగంగా అమెరికా తరలించిన యూఎస్‌ఎస్ స్ప్రువాన్స్, యూఎస్‌ఎస్ ప్రెబుల్ అనే నౌకలు ప్రస్తుతం స్ప్రాట్లీ దీవులకు 12 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నట్టు సీఎన్‌ఎన్ వార్తా సంస్థ వెల్లడించింది.

అమెరికా తీరు పట్ల చైనా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే వాణిజ్య యుద్ధంలో సిగపట్లు పట్టుకుంటున్న అమెరికా-చైనా ఆ సమస్య పరిష్కారం కోసం వచ్చే నెల 1వ తేదీలోగా ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో అమెరికా రెండు యుద్ధనౌకలను స్ప్రాట్లీ దీవుల వద్దకు తరలించడంపై చైనా మండిపడింది.

తమ ప్రాదేశిక జలాలను అమెరికా ఉల్లంఘిస్తున్నదని, దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఉద్రిక్తతలను సృష్టించి శాంతిని తుంగలో తొక్కుతున్నదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ సోమవారం ఆరోపించారు. తమను రెచ్చగొట్టే చర్యలను అమెరికా కట్టిపెట్టాలని ఆమె కోరారు. చిన్నచిన్న దీవులతోపాటు వందకుపైగా పగడపు దీవులు (రీఫ్స్)ల సమాహారమైన వివాదాస్పద స్ప్రాట్లీ దీవులు ఫిలిప్పీన్స్, మలేషియా, దక్షిణ వియత్నాం తీరప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి.

ఇవి తమ దీవులని తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం చెప్తుంటే.. ఈ దీవులన్నీ తమవేనని చైనా వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేయడంతోపాటు అంతర్జాతీయ న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్న జలమార్గాలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు తమ యుద్ధనౌకలను స్ప్రాట్లీ దీవుల వద్దకు తరలించినట్టు అమెరికా నౌకాదళ 7వ ఫ్లీట్ అధికార ప్రతినిధి కమాండర్ క్లే దాస్ తెలిపారు.