దీక్షలా పేరుతో ప్రజల సొమ్ము దుబారా

దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంపై నిరసన తెలపాలనుకుంటే బాబు ఒక్కరే ఢిల్లీ వెళ్లి దీక్ష చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు.

ఈ ఐదేళ్లలో అవినీతి, అక్రమాలు, అరాచకం తప్ప రాష్ట్ర అభివృద్ధి చేశారా? అని ఆయన నిలదీశారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఆహ్వానించటానికి కనీసం ప్రొటోకాల్‌ పాటించే సంస్కారం లేని వారని మండిపడ్డారు. చంద్రబాబు ఆంధ్రుల పరువు తీశారని దుయ్యబట్టారు.

ఏపీకి రూ.10 లక్షల కోట్లు ఇచ్చామని గడ్కరీ లెక్కలు చెప్పారని, చర్చకు రావాలని సవాల్‌ చేస్తే చంద్రబాబు ముందుకు రాలేదని గుర్తు చేశారు. యూటర్న్ ముఖ్యమంత్రి ఇప్పుడు మతిస్థిమితం లేని ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ఏపీలో దూరం పెట్టారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.