రఫేల్‌ ఫోబియాతో బాధపడుతున్న రాహుల్

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రఫేల్‌ ఫోబియాతో బాధపడుతున్నారని కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ విమర్శించారు. ప్రధాని మోదీ పట్ల అమర్యాదగా మాట్లాడుతున్న రాహుల్‌కు తన పూర్వీకులు గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీపై ఎన్ని అవినీతి ఆరోపణలున్నా తామెప్పుడూ అమర్యాదగా మాట్లాడలేదని గుర్తు చేశారు.  

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మన్‌కీ బాత్ మోదీకే సాథ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశాన్ని కాంగ్రెస్ పాలించిన సమయంలో రుణాల పేరుతో బ్యాంకులను దోపిడీ చేయించారని ఆరోపించారు. ఆనాడు రుణాలు తీసుకున్నవాళ్లే.. ఈనాడు దేశాన్ని వదిలి పారిపోయారని గుర్తు చేశారు. రుణాలు తీసుకున్న వారి నుంచి తిరిగి రాబడుతున్నామని చెప్పారు.

రఫేల్ ఒప్పందంలో అవినీతి జరగలేదంటూ సుప్రీంకోర్టు  తీర్పు ఇచ్చినా కాంగ్రెస్ మాత్రం అబద్ధాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. దేశ రక్షణపై తాము చిత్తశుద్ధ్దితో ముందుకు సాగుతున్నామని ప్రసాద్  తెలిపారు. కాంగ్రెస్ కన్నా 9 శాతం తక్కువ ధరకు విమానాలను కొనుగోలు చేశామని, 20 శాతం తక్కువ ధరకు ఆయుధాలు కొనుగోలు చేశామని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు.

 తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థ్ధిక రంగంలో దేశం ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దేశం 11వ స్థానంలో నిలిచిన సంగతిని గుర్తు చేశారు.

అవినీతికి తావులేకుండా ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్న మోదీని గద్దె దింపాలన్న ఉద్దేశంతో మహాకూటమి ఏర్పాటు చేశారని పేర్కొంటూ ఈ కూటమి ద్వారా అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా గతంలో వివిధ కూటములు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల కాలాన్ని ఆయన ప్రస్తావించారు.  రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే 300 సీట్లు గెలుస్తుందని, మళ్లీ మోదీనే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

‘భారత్ కే మన్ కి భాత్..మోదీకే సాథ్’ పేరుతో కేంద్రం చేపట్టి, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తామని, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించే విషయంలో ‘నూతన భారతదేశం అభివృద్ధి కోసం పౌరుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని వివరించారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా ఏడు వేల బాక్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. 

నవ భారత అభివృద్ధికి ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు దేశవ్యాప్తంగా ఏడు వేల సూచిక బాక్సులు ఏర్పాటు చేశామని, 300 రథాలను తిప్పిస్తున్నామని చెప్పారు. ఎవరైనా 6357171717 ఫోన్‌ నంబరుకు మిస్‌డ్‌ కాల్‌ ఇచ్చి తమ సలహాలు రికార్డు చేయొచ్చని సూచించారు. మెయిల్స్ ద్వారా, ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా స్వీకరిస్తామని చెప్పారు. 

ఈ సందర్భంగా కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి వివరిస్తూ జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామీణ రహదారుల నిర్మాణం రెట్టింపు చేశామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50 కోట్ల మందికి వైద్యమందిస్తున్నామని ప్రకటించారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెట్టుబడి కింద రైతులకు రూ. 6 వేల సాయం కూడా అందిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.