రక్షణ రంగంలో దళారీలనే ప్రోత్సహించిన కాంగ్రెస్

 దేశ భద్రతను కాంగ్రెస్ విస్మరించిందని, రక్షణ విభాగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేవలం దళారీలనే ప్రోత్సహించినదని, సమైక్యతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నదని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆదివారం తమిళనాడులో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తూ తిరుపూర్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రక్షణ విభాగానికి సంబంధించిన అనేక కుంభకోణాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ రంగాన్ని కేవలం ముడుపులు, కమీషన్లు సంపాదించుకునే ఒక మార్గంగానే కాంగ్రెస్ నేతలు చూశారని మోదీ ఆరోపించారు. 

దేశ భద్రత పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘సముద్రం నుంచి ఆకాశం వరకూ డిఫెన్స్‌కు సంబంధించిన ఎన్నో కుంభకోణాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. రక్షణ విభాగంలో ఆధునీకరణను కొన్ని దశాబ్దాలపాటు కాంగ్రెస్ అడ్డుకుంది’ అంటూ నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లోనూ ఆ పార్టీ అక్రమాలకు పాల్పడిందని పరోక్షంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే ఎన్డీఏ పనితీరు భిన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. 

ఏళ్లకు ఏళ్లు దేశాన్ని పాలించిన పార్టీ రక్షణ విభాగాన్ని రక్షణ విభాగాన్ని పూర్తిగా విస్మరించారంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రక్షణ విభాగంలో స్వయం సంవృద్ధి సాధించాలన్నదే ఎన్డీఏ సర్కారు లక్ష్యమని స్పష్టం చేశారు. దేశాన్ని భద్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను త్రివిధ దళాలకు తమ ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. 

ఇలావుంటే, చెన్నై మెట్రో రైల్ బ్ల్యూలైన్ చివరి దశను మోదీ వీడియో కానె్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఆరు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ల నిర్మాణాన్ని ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ తదితరుల సమక్షంలో ఆయన చెన్నై పెట్రో ప్యాసింజర్‌ను జెండా ఊపి ప్రారంభించారు. తమ సుడిగాలి పర్యటనలో చెన్నై విమానాశ్రయం ఆధునీకరణ రెండో దశ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు.

 తిరుచునాపల్లి ఎయిర్‌పోర్ట్‌లో సమగ్ర టెర్మినల్ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. అదే విధంగా తిరుపూర్‌లో వంద పడగల సామర్థ్యంగల ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. బీపీసీఎల్ ఎనోర్ కోస్టల్ ఇన్‌స్టలేషన్‌ను ఆయన జాతికి అంకితమిచ్చారు. ఇక్కడ చమురు నిలువ, సరఫరా వ్యవస్థను పూర్తిగా యాంత్రీకరించారు. చెన్నై ఓడరేవు నుంచి చెన్నై పెట్రోలియం కార్పొరేషనల్ లిమిటెడ్‌కు చెందిన మనాలీ రిఫైనరీ వరకూ 393 కోట్ల రూపాయల విలువైన ముడి చమురు పైప్‌లైన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.