99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కు

రద్దయిన నోట్ల లెక్కింపు దాదాపు 21 నెలల తర్వాత ముగిసినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ద్వారా తెలియజేసింది. 99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

‘2016, నవంబరు 8 ముందు వరకు రూ.15.41లక్షల కోట్ల 500, 1000నోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇప్పటి వరకూ రూ.15.31లక్షల కోట్ల రద్దయిన నోట్లు బ్యాంకుల ద్వారా వెనక్కి వచ్చాయి. బ్యాంకులకు వచ్చిన రద్దయిన నోట్ల లెక్కింపు విజయవంతంగా ముగిసింది. వీటి లెక్కింపు కోసం ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాం’ అని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.

నవంబరు 8, 2016న రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రద్దయిన నోట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. వీటి స్థానంలో కొత్తగా రూ.2000 నోటును, కొత్త రూ.500నోటును తీసుకొచ్చారు.

రెండు వేల నోటు తీసుకురావడంతో ప్రజలకు చిల్లర కష్టాలు తలెత్తాయి. దాంతో వాటిని అధిగమించేందుకు ఆర్బీఐ కొత్తగా రూ.200, రూ.50 నోట్లను కూడా చెలామణీలోకి వచ్చాయి.