ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. మోదీ భరోసా

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుంటూరు బహిరంగసభలో భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే నిధుల కంటే ఎక్కువే ఇచ్చామని చెబుతూ కేంద్ర పథకం హృదయ్‌ కింద అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రధాని మోదీ వెల్లడించారు.

2016 సెప్టెంబర్‌లో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశామని గుర్తు చేస్తూ  ప్రత్యేక ప్యాకేజీ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పార, ప్యాకేజీపై శాసనసభలో అభినందిస్తూ తీర్మానం చేశారని పేర్కొన్నారు. "మేం ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేశాం. ప్యాకేజీని వినియోగించుకోవడంలో సీఎం విఫలమయ్యారు" అని విమర్శించారు.

రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులను ఇచ్చామని చెబుతూ విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తూ వచ్చామని తెలిపారు. ఐఐటీ తిరుపతి, సెంట్రల్‌ వర్సిటీ, ఎయిమ్స్‌ వంటి సంస్థలు ఏపీకి వచ్చాయి. కేంద్ర నిధులతో విశాఖ- చెన్నై కారిడార్‌ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాల విస్తరణ, నిర్మాణ పనులు చేపడుతున్నాం. రాజధాని అమరావతి అనుసంధానానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. ఏపీలో చేపట్టిన 8 పెద్ద ప్రాజెక్టుల్లో 6 ప్రాజెక్ట్‌ పనులు మొదలయ్యాయని మోదీ వివరించారు.

ఏపీలో రూ.వేల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులను ప్రారంభించడంతో దేశం మొత్తానికి చమురు రంగంలో ఏపీకి అగ్ర ప్రాధాన్యం లభిస్తుందని ప్రధాని వెల్లడించారు. పెట్రోలియం నిల్వల్లో ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెబుతూ ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా గ్యాస్‌ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని ప్రకటించారు.

ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్‌ ద్వారా ఎరువుల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందని చెబుతూ అన్ని నగరాల్లో గ్యాస్‌ పంపిణీ చేసేందుకు దీనిని‌ అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలను పెట్రోలియం హబ్‌గా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా పట్టణాల్లో జరిగే మార్పుల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు.