అందుకే ‘చౌకీదార్’ అంటే చంద్రబాబుకి భయం

అమరావతి నుంచి పోలవరం దాకా చేపట్టిన ప్రాజెక్టుల్లో చంద్రబాబు ఏం చేశారో ఆయనకు బాగా తెలుసునని, అందుకే మోదీ అనే చౌకీదార్ (సేవకుడు) పేరు చెబితే ఆయనకు భయమేస్తోందని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ  గుంటూరు బహిరంగ సభలో ఎద్దేవా చేశారు. సొంత సంపదను పెంచుకోవడానికి జనం నేతల్ని ఎన్నుకోలేదని, దేశ సంపదను పెంచడానికి ఎన్నుకున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని చదన్రాబాబుకు మోదీ హితవు చెప్పారు.

‘‘నన్ను తిట్టడం సరే, ముందు ఏపీ నిలదీస్తుంది. చంద్రబాబూ.. సమాధానం చెప్పండి. మీరు ఖర్చు చేస్తున్న సొమ్ము ఎవరిది. జనం సొమ్మును నీళ్లలా ఖర్చు పెడతారా?’’ అని చంద్రబాబును మోదీ ప్రశ్నించారు. పదేపదే చంద్రబాబు చెప్తున్న అబద్ధాలు చూస్తే జనంలో ఆయన విశ్వాసం కోల్పోయారని అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఓడిపోవడం ఖాయమైపోయిందని మోదీ ఉద్ఘాటించారు.

కేంద్ర నిధులకు లెక్కలు చెప్పాలంటే చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారని ప్రధాని  ధ్వజమెత్తారు. అందుకనే ఇప్పుడు రోజూ తనను తిట్టే పనులలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. గతంలో ఆయన కేంద్రం నిధులకు లెక్క చూపేవారు కాదంటూ ఈ బహిరంగ సభలో అధికార కార్యక్రమాలు జరిగిన చిన్న టెంట్‌ మినహా మిగిలిందంతా పార్టీ కార్యకర్తలు సమకూర్చిన నిధులతోనే బీజేపీ ఏర్పాటు చేసినదని ప్రధాని తెలిపారు.

అయితే  రేపు ఫొటోలను తీయించుకోవడానికి టిడిపి  నాయకులంతా దిల్లీ వెళుతున్నారని, అందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారని విమర్శించారు. ఇదే వారికీ మనకు ఉన్న వ్యత్యాసం. నన్ను తిట్టడం మానేసి ఎక్కడి నుంచి ఈ సొమ్ము వినియోగిస్తున్నామో ప్రజలకు చెప్పమని సవాల్ చేశారు.

ఏపీని సన్‌రైజ్ స్టేట్‌గా రూపొందిస్తానన్న చంద్రబాబు నిజంగానే సన్(కొడుకు) రైజ్ స్టేట్ కోసం కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని, కాంగ్రెస్‌తో చేతులు కలపడం అందుకు నిదర్శనమని దుయ్యబట్టారు తన సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి అనే క్లబ్‌లో చేరారని విమర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా ధరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. తమకు దిష్టి తగలకుండా ఉండేందుకే ఆయన నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలిపారంటూ మోదీ వ్యాఖ‍్యానించారు. కాగా ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు నల్ల చొక్కాలు ధరించి, నల్లజెండాలు, బెలూన్లుతో, మోదీ గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపిన విషయం తెలిసిందే.

టీడీపీ నిరసనలపై నరేంద్ర మోదీ బీజేపీ ప్రజా చైతన్య సభలో మాట్లాడుతూ... ‘టీడీపీ వాళ్లు నల్ల బెలూన్లు ఎగరేసి మాకు దిష్టి తీశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇది మాకు శుభ సూచకం. ఢిల్లీ వెళ్లి మళ్లీ అధికార పీఠంపై కూర్చోమని గో బ్యాక్ అంటున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీకి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈసారి కూడా అధికారం మాదే’  అని స్పష్టం చేశారు.