చంద్రబాబు సీనియర్ ... ఆయనతో పోటీ పడలేను ... మోదీ ఎద్దేవా

‘‘నా కంటే సీనియర్‌ అని చంద్రబాబు చెప్పుకుంటారు. అవును, కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఆ విషయంలో నేను ఆయనతో పోటీ పడలేను’’ అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎద్దేవా చేశారు. 

గుంటూరులో నిర్వహించిన బిజెపి  ప్రజా చైతన్య సభలో మోదీ మాట్లాడుతూ ఏ పార్టీ అయితే రాష్ట్రాన్ని మోసం చేసిందో ఆ పార్టీతోనే చంద్రబాబు జట్టు కట్టారంటూ విమర్శలు గుప్పించారు. తన కంటే సీనియర్ అనడంలో వివాదం ఏమీ ఏలెదని చెబుతూ సీనియర్ నేత కావడంతో ఆయనకు ఇవ్వవలసిన గౌరవం ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నానని చెప్పారు. 

‘‘దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోదీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారు. ఏపీలో మౌలిక వసతులను గొప్పగా మారుస్తామన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పి  కూలిన పార్టీని నిర్మించే పనిలో ఉన్నారని ప్రధాని ధ్వజమెత్తారు. సన్‌రైజ్‌ రాష్ట్రం చేస్తానని చెప్పి.. కుమారుడి అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారని టిడిపి అధినేతను దుయ్యబట్టారు. 

సీనియారిటీ విషయంలో మీతో పోటీ పడలేనని, అయితే ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం ఆయనతో ఏకీభవించలేనని స్పష్టం చేశారు. "రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో మీరు జట్టు కట్టారు. ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ విముక్త రాష్ట్రం చేయాలని సంకల్పించారు. వారితోనే మీరు జట్టు కట్టారు. దీన్ని చూస్తుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంటుంది"అని విమర్శించారు. 

చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకే తాను ఇక్కడకు వచ్చానని ప్రధాని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయపడుతున్నారని,  తన కుమారుడిని రాజకీయాల్లో అందలం ఎక్కించాలని చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు. తానేదో గొప్ప పథకాలను నిర్మిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, నిజానికి అవన్నీ కేంద్ర పథకాలేనని ఎద్దేవా చేశారు. సీఎం వ్యక్తిగత లబ్ధి పొందారే కానీ, అమరావతికి ఒనగూరిన లబ్ధి ఏమటని నిలదీశారు. 

ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా ఎవరైతే వచ్చారో వారి కలలను సాకారం చేయాల్సిన అవసరం వారి వారసులుకు ఉందా లేదా అని చంద్రబాబును ఉద్దేశించి సభికులను ప్రధాని ప్రశ్నించారు.