చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కన్నా


ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా గుంటూరులో ఆదివారం జరిగిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన మాట్లాడుతూ ‘అవినీతి, అక్రమాలతో కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను చంద్రబాబు కొల్లగొట్టారు. అలా కూడబెట్టిన సొమ్ముతో నేడు ఓట్లు కొనుక్కునే స్థితికి వచ్చారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయారు. దొంగలా రాత్రికి రాత్రే విజయవాడకు పరార్‌ అయ్యారు' అంటూ దుయ్యబట్టారు. 

చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ  విజయవాడలో అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. కనీసం ఉద్యోగలుకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు.

ప్రధాని చేసిన మేలును ఏపీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని కన్నా చెప్పారు. భారత దేశ ప్రతిష్ఠను దశదిశలా మోదీ తీసుకెళుతున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. అయినా ఇక్కడికి ప్రజలు భారీగా తరలివచ్చారని తెలిపారు. ప్రాజెక్టులు, గ్రాంటులు, సంక్షేమ పథకాల రూపంలో ఏపీకి మోదీ ఎన్నో పనులు చేశారని పేర్కొన్నారు. 

ఏపీ అభివృద్ధికి లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. కానీ సీఎం చంద్రబాబు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల నోట్లో మట్టి కొట్టి భూములు లాక్కున్నారని అంటూ  ఏపీకి ఏమీ చేయలేదని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని కన్నా విమర్శించారు.  

పోలవరం నిర్మాణానికి 100 శాతం నిధులు కేంద్రమే ఇస్తోందని తెలిపారు. అనంతపురంలో కియా కార్ల తయారీ పరిశ్రమ రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవే కారణమని కన్నా కొనియాడారు.ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తోందని వెల్లడించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. 

40 ఏళ్ల రాజకీయ అనుభం ఉందని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రాభివృద్ధిలో ఎందుకు చూపించడంలేదని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు దమ్ముంటే అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు రూ.6 వేల ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటించారని గుర్తు చేశారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ముందుకెళ్తోందని అన్నారు.