సొంత కుంపటి పెట్టుకున్న శివపాల్‌

ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పొసగక పార్టీలో కొంతకాలంగా ఎటువంటి ప్రాధాన్యత లేకుండా మౌనంగా ఉంటున్న శివపాల్ యాదవ్ ఇప్పుడు పార్టీ నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. పార్టీ సుప్రేం ములాయం సోదరుడు శివపాల్ సింగ్‌ యాదవ్‌ కు మాజీ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడైన అఖిలేశ్‌ యాదవ్‌తో మొదటి నుండి పడటం లేదు. ములాయం ఆధిపత్యం ఉన్నప్పుడు పార్టీలో కీలక పాత్ర వహిస్తూ వచ్చిన శివపాల్ కు అఖిలేష్ హయం వచ్చేసరికి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.

తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు శివపాల్ ప్రకటించారు. పార్టీ పేరును ‘సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా’ గా ప్రకటించారు.  ‘నాకు పార్టీలో ఎలాంటి పని కల్పించడం లేదు. అందుకే నేను సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నాను’ అని ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ ఐకమత్యంగా ఉండాలని అనుకున్నానని, అందుకోసం తాను చాలా రోజులు ఎదురుచూశానని చెప్పారు. కాగా, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కకు పెడుతున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు శివపాల్‌ వెల్లడించారు.

రెండేళ్ల క్రితం శివపాల్‌కు, అఖిలేశ్‌కు మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.  సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్‌ను అఖిలేశ్‌ తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. అప్పట్లో తమ్ముడు శివపాల్‌కు ములాయం బాసటగా నిలిచారు. దీంతో అఖిలేశ్‌, ములాయంల మధ్య కూడా తేడాలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీలో శివపాల్‌కు ప్రాధాన్యం లభించడం లేదు. గత నెలలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి కూడా శివపాల్‌ హాజరుకాలేదు.