విశాఖలో మోడీ సభకు స్థలం ఇవ్వని ఏయు !

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈ నెల 27న విశాఖపట్నంలో బిజెపి జరుప తలపెట్టిన బహిరంగ సభకు స్థలం ఇవ్వడానికి ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు నిరాకరిస్తున్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడులు వస్తున్నాయని, నేరుగా ముఖ్యమంత్రిని అడిగి అనుమతి తెచ్చుకొనండని స్పష్టం చేస్తున్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ పలు సభలు పెట్టిన యూనివర్సిటీ మైదానాన్ని ప్రధాని సభకు ఇవ్వ నిరాకరించడం పట్ల బిజెపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానమంత్రి సభకు అనుమతి నిరాకరించిన ఏయూ అధికారులు గతంలో టీడీపీ మహానాడు మొదలు పార్టీ సభలకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2017 మే నెలలో టీడీపీ మూడు రోజులపాటు ఏయూ గ్రౌండ్స్‌లో మహానాడు సభలు నిర్వహించింది. 2018 మేలో ఇదే ఏయూ గ్రౌండ్స్‌లో ధర్మపోరాట సభ పేరిట తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఏయూను పూర్తిగా టీడీపీ జెండాలతో పసుపుమయం చేసేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

గతేడాది ఆగస్టులో జ్ఞానభేరి సదస్సు, గత నెలలో పసుపు కుంకుమ పంపిణీ పేరిట టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలతో భారీ సభ నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అధికార టీడీపీ నేతల కుమారుల వివాహాలు మొదలు, గతేడాది మంత్రి లోకేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు కూడా ఏయూలోనే అట్టహాసంగా నిర్వహించారని అంటున్నారు. 

ప్రధానమంత్రి సభకు అనుమతించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు అడిగారని, రాజకీయ పరమైన సభ కాబట్టి కుదరదని చెప్పామని వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు చెబుతున్నారు. పైగా, ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే మాకు అభ్యంతరం లేదని అంటున్నారు. తెలుగుదేశం నాయకులు ఏయూను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారని, టీడీపీ కార్యక్రమాలకే కాకుండా ఆ పార్టీల నేతల వివాహాలకు కూడా గ్రౌండ్స్‌ వాడుతున్నారని

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజుపేర్కొన్నారు. కానీ, ప్రధానమంత్రి బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణం అని మండిపడ్డారు. వీసీని అనుమతి అడిగితే కుదరదన్నారని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశానని తెలిపారు. కేవలం ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యానే ఏయూ గ్రౌండ్స్‌ సరైందని భావించి అడుగుతున్నట్లు పేర్కొన్నారు.