అబద్ధాలకోరులకు ప్రజలు గుణపాఠం చెబుతారు


పలు అంశాలపై అబద్ధాల ప్రచారానికి దిగుతోన్న ప్రతిపక్షాలకు ప్రజలు తగు గుణపాఠం చెపుతారని ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. రాఫెల్, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభంపై ప్రతిపక్షాల దాడిని ఆయన తిప్పికొట్టారు. దళారీల వ్యవస్థతో దోచుకు తినాలనుకునే వారే ప్రతిపక్ష కూటమిదార్లు అని మండిపడ్డారు. ఈశాన్య భారత పర్యటనలో ఉన్న ప్రధాని శనివారం త్రిపురలోని అగర్తలా సభలో మాట్లాడారు.

 ‘ఈ ఛాయ్‌వాలా ఎప్పుడూ సదుద్ధేంతోనే పనులు చేపడుతాడు. ప్రజలకు మంచి కోసం పాటుపడుతాడు. చౌకీదారుగా కాపలా కాస్తాడు. ఈ విషయం ప్రజానీకానికి తెలుసు. అందుకే అసత్యాలు వల్లిస్తోన్న వారికి ప్రజలు తగు బుద్ధి చెప్పితీరుతారు’ అని ప్రధాని స్పష్టం చేశారు. రాఫెల్ డీల్‌పై ప్రతిపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ దాడిని ఉధృతం చేసిన నేపథ్యంలో ఇక్కడి వేదిక నుంచి ప్రధాని ఎదురుదాడికిద దిగారు. ఛాయ్‌వాలా ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తారని చెప్పారు. లేనివి ఉన్నట్లుగా ప్రచారానికి దిగే వారిని ప్రజలు దెబ్బతీస్తారని హెచ్చరించారు. 

తప్పుడు ప్రచారానికి దిగు తోన్న ప్రతిపక్షాలు అన్ని జట్టుకడుతున్నాయని, వారికి ఇప్పుడు ఇదే పనిగా మారిందని విమర్శించారు. అవినీతిపరులు, అక్రమాలకు దిగేవారి కూటమి మహామిలావట్‌గా మారిందని, దీనిని తాను పదేపదే ప్రస్తావి స్తున్నానని, ఇటువంటి అక్రమ కూటములు ఎన్ని వచ్చిన ఏమీ ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనులలో, కాంట్రాక్టులలో ముడుపులు, దళారీలకు వంత పాడే నిండు అవినీతి పాపపు వ్యక్తుల కలయికలు వస్తున్నాయని మండిపడ్డారు. 

ఢిల్లీలో బలహీన ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు వారు యత్నిస్తున్నారని, కేంద్రంలోని బలవంతపు ప్రభుత్వం అంటే వారికి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష కూటమిలోని నాయకుల మధ్య ఇప్పుడు ఒలిం పిక్స్ జరుగుతోందని, ఎవరు ఎక్కువగా మోడీని దూషిస్తారనే పోటీ సాగు తోందని, దూషణలలో వారు పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రజానీకం అంతా మోడీ పట్ల అభిమానం చూపుతోందని, వారి ఆకాంక్షలను మోడీలో చూసుకుంటున్నారని పేర్కొన్నారు. 

యువత, పేద ప్రజలు, రైతులు అంతా మోడీ వైపు ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష నేతలు దీనితో దిక్కుతోచని స్థితిలో పడ్డారని ధ్వజమెత్తారు. ఒకచోట కలిసి ఫోటోలకు ఫోజు లిచ్చిన నేతలు ఆ తరువాత ఎక్కడా ఒకే వేదికపై కన్పించబోరని, ఇదే వారి తంతుగా ఉంటోందని విమర్శించారు. అసత్యాలకు దిగే వారిని ఏ విధంగా చూడాలనేది ప్రజలకు తెలుసని భరోసా వ్యక్తం చేశారు.