నేడు మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన

ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో గుంటూరు, తమిళనాడులో తిరుపూర్‌, కర్ణాటకలో హుబ్బళ్లిలలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. 

తొలుత ఆదివారం ఉదయం 11.15 గంటలకు ప్రధానమంత్రి గుంటూరుకు చేరుకుంటారు. అక్కడి కార్యక్రమాలు ముగిశాక తిరుపూర్‌ వెళ్తారు. తిరుచ్చి విమానాశ్రయంలో నూతన సమీకృత భవన నిర్మాణం, చెన్నై విమానాశ్రయ ఆధునికీకరణ పనులకు అక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. చెన్నైలో నిర్మించిన 470 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిని, బీపీసీఎల్‌కి చెందిన ఎన్నోర్‌ కోస్తా టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారు. 

చెన్నై విమానాశ్రయం నుంచి మనాలి చమురుశుద్ధి కర్మాగారం వరకు ఏర్పాటుచేసిన ముడి చమురు పైప్‌లైన్‌ను ప్రారంభిస్తారు. భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని కూడా ప్రారంభించాక కర్ణాటకలోకి హుబ్బళ్లికి వెళ్తారు. ధార్వాడ్‌లో నిర్మించే ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీలకు శంకుస్థాపన చేస్తారు. మంగళూరు రేవులోని 1.5 మిలియన్‌ టన్నుల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను జాతికి అంకితం చేస్తారు. 

చిక్కజాజూరు-మాయకొండ మధ్య 18 కిలోమీటర్ల రైల్వే జంటమార్గాన్ని ప్రారంభిస్తారు. దీనివల్ల బెంగళూరు-హుబ్బళ్లిల మధ్య రైళ్లు వేగంగా రాకపోకలు సాగించడానికి వీలవుతుంది.