చైనా హెచ్చరికలు బేతఖార్ .. అరుణాచల్ లో ప్రధాని మోదీ


చైనా చేసిన హెచ్చరికలను ఖాతరు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమే అని, తమ నేతలు స్వేచ్ఛగా అక్కడకు వెళ్లి, వస్తూనే ఉంటారని మరోమారు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 

అరుణాచల్ ప్రదేశ్‌లోని సేలా టన్నెల్ ప్రాజెక్టుకు ప్రధాని  శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, ఫార్వార్డ్ ఏరియాల్లో అన్ని కాలాలకూ ఈ టన్నెల్ ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో చైనా నుంచి భారతదేశ భద్రతకు వ్యూహాత్మకంగా కూడా ఈ టన్నెల్ ఉపయోగపడుతుంది. అత్యవసర సమయాల్లో బలగాలు వేగంగా కదిలేందుకు వీలుగా ఈ సొరంగం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.  

రూ.687 కోట్ల అంచనా వ్యయంతో రూపొందనున్న సేలా టన్నెల్ ప్రాజెక్టును బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్మిస్తుంది. రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. 12.04 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ చెరో 1790, 475 మీటర్లతో రెండు టన్నెళ్లను ఈ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తారు.

సేలా టన్నల్ నిర్మాణం పూర్తయితే తేజ్‌పూర్ నుంచి తవాంగ్‌కు ప్రయాణించే సమయం గంటకు పైగా తగ్గుతుంది. 13,700 అడుగుల ఎత్తుతో మంచులో ఉండే సేలా ప్రయాణంలో జరిగే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. 

మరోవంక, అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా చేసిన హెచ్చరికను భారత ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని గట్టిగా చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రాష్ట్రంలో శనివారం పర్యటించిన నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెచ్చరికను తోసిపుచ్చింది.

చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ద్వైపాక్షిక సంబంధాల మొత్తం పరిస్థితికి అనుగుణంగా నడచుకోవాలని భారత దేశానికి సలహా ఇచ్చింది. చైనా ప్రయోజనాలను గౌరవించాలని కోరింది. ఉభయ దేశాల మధ్య మెరుగవుతున్న సంబంధాల వేగాన్ని గుర్తించాలని పేర్కొంది. సరిహద్దు సమస్యను జటిలం చేసే, వివాదాన్ని తీవ్రతరం చేసే చర్యల నుంచి సంయమనం పాటించాలని తెలిపింది.

దీనిపై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ‘‘అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత దేశంలో అంతర్భాగం, విడదీయరాని, పరాధీనం చేయడానికి వీలుకాని ప్రదేశం అని తెలిపింది. భారత దేశ నేతలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించినట్లుగానే ఎప్పటికప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తారని స్పష్టం చేసింది. ఈ స్థిరమైన వైఖరిని అనేక సందర్భాల్లో చైనాకు తెలియజేసినట్లు పేర్కొంది.