గత ప్రభుత్వాలు సరిహద్దులను పట్టించుకోలేదు

 

తాము సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ (అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి) అనే నినాదంతో పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు దేశంలోని యువత, దేశ సరిహద్దుల భద్రతల విషయాలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 

అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటనలో భాగంగా శనివారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హొల్లొంగిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... ‘కొత్త ఇండియా కల సాకారం కావాలంటే తూర్పు, ఈశాన్య భారత్‌ వేగంగా అభివృద్ధి చెందాలని నేను చాలాసార్లు చెప్పాను. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ (అందరి అభివృద్ధి కోసం అందరితో కలిసి) అనే నినాదంతో పని చేస్తున్నాం' అని పేర్కొన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు ఎటువంటి నగదు కొరతా ఏర్పడకుండా ఈ నాలుగున్నరేళ్లు పనిచేశాం. సౌభాగ్య పథకం ద్వారా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 100 శాతం ఇళ్లకు విద్యుత్తు సదుపాయం కలిగింది. ఈ విషయంపై అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని వివరించారు. ఈ రోజు అరుణాచల్‌ ప్రదేశ్‌ సాధించిన ఈ విజయాన్ని త్వరలోనే దేశం మొత్తం సాధించనుందని వెల్లడించారు. 

 రెండేళ్లలో ఈ రాష్ట్రంలోని 1,000 గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేశామని,  ఈశాన్య భారత్‌లోని అన్ని రాష్ట్రాల రాజధానులను రైల్వే నెట్‌వర్క్‌తో కలిపేందుకు పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. `అరుణాచల్‌ ప్రదేశ్‌ దేశానికే గర్వకారణం. సరిహద్దుల వద్ద ఉన్న ఈ రాష్ట్రం దేశానికే భద్రత కల్పిస్తోంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత' అని స్పష్టం చేశారు. 

ఈ రాష్ట్రంలో తాను పలుసార్లు పర్యటించానని, ఈ రోజు రూ.4,000 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించానని చెప్పారు.   అరుణాచల్‌ ప్రదేశ్‌లో రైల్వే నెట్‌వర్క్‌, విమానాశ్రయాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రధానమంత్రి కిసాన్‌ సన్మాన్‌ నిధిని ప్రకటించాం. దీనిద్వారా దేశంలోని రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 వేస్తామని ప్రధాని తెలిపారు.