మానస సరోవర యాత్రకు రాహుల్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మానస సరోవర యాత్ర చేపట్టనున్నారు. వచ్చే రెండు రోజులలో ఆయన యాత్రకు బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  తనకు తాను శివ భక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్ శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చేపట్టనుండటం ఆసక్తి రేపుతున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో గత ఏప్రిల్‌లో రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఎన్నికలు పూర్తి కాగానే తాను ఈ యాత్ర చేస్తానని రాహుల్ ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో తనకు తృటిలో విమాన ప్రమాదం తప్పిందని, అప్పుడే ఈ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ తెలిపారు. ఆ ఎన్నికల సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం కొన్ని నిమిషాల పాటు రాడార్‌కు చిక్కకుండా పోయింది.

అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో అప్పుడే తాను ఆ పరమశివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఈ యాత్ర కోసం రాహుల్‌గాంధీ దరఖాస్తు చేసుకోలేదని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్ర చైనా గుండా సాగుతుండటం వల్ల ముందుగానే యాత్రికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రత్యేకంగా అనుమతి తీసుకోవడం లేదా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా యాత్ర చేసే అవకాశాలు రాహుల్ ముందు ఉన్నాయి. బీజేపీ హిందుత్వ ఎజెండాకు పోటీగా గుజరాత్, కర్ణాటక ఎన్నికల్లో కనిపించిన గుళ్లన్నీ తిరిగిన రాహుల్ ఇప్పుడీ యాత్రతో మరో బలమైన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేపాల్ గుండా యాత్ర చేపట్టవచ్చని తెలుస్తున్నది.